ఫ్రెండ్లీ గవర్నమెంటే కదా! ఓపీఎస్‌పై కాలయాపనేలా?

ప్రభుత్వాలకు ప్రజలకు అనుసంధానంగా ఉంటూ, ప్రభుత్వ పథకాల(విధానాల)ను ప్రజలకు చేరవేస్తుండే వారే ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిలా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాల పనితీరుకు అద్దం పట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి నేడు దయనీయంగా ఉంది. రాబోయే నాలుగు నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వ గడువు, పదినెలల్లో కేంద్ర ప్రభుత్వ గడువు తీరిపోయి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ అపరిష్కత సమస్యల సాధనకు ఇదే చివరి(తగిన) సమయమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి. ఆ మేరకు ఉమ్మడి ఐక్య ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకొని దశల వారీగా ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా, ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ యుఎస్‌పిసి (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ) పోరాట కార్యక్రమాలు చేస్తున్నది. మొదటి దశలో జూలై 18,19 తేదీల్లో మండల కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు తీసింది. అలాగే రెండవ దశలో ఆగస్టు12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేసింది. మూడో దశలో 1 సెప్టెంబర్‌ పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా చలో హైదరాబాద్‌ (ఇందిరాపార్కు వద్ద మహాధర్నా)ను యుఎస్‌పిసి నిర్వహించ తలపెట్టింది. దీనికంటే ముందే గతంలో అనేక ఉద్యమాలు, పోరాటాల మూలంగా సాధించుకున్న హక్కులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పరిగణనలోకి తీసుకొని నేడు అన్ని సంఘాలు ఐక్యఉద్యమాలకు సంఘటితంగా సమస్యల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ సంఘాల ఐక్యవేదిక నాయకుల వద్దకు యుఎస్‌పిసి చొరవ తీసుకొని వెళ్ళి కలిసింది.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉమ్మడి జేఏసీ ఏర్పాటు కోసం కలిసి రావాలని కోరడం జరిగింది. కాని నేటికీ వారు నిర్ణయం తెలపలేదని తెలుస్తోంది. సగటు ఉద్యోగ, ఉపాధ్యాయులు మాత్రం పెరిగి పోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వాల పన్నులు, సెస్సుల బాదుడుకు తోడుగా పెండింగ్లో ఉన్న ఏ ఒక్క సమస్య కూడా నేటికీ పరిష్కారం కాకపోగా, ఒకటో తారీఖునే వచ్చే వేతనాలు నెల చివరి వరకు రాక పోవడంతో అది ఒక డిమాండ్‌గా చేయాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయని ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు పడేలా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న హక్కు గత కొన్నాళ్లుగా ఏనాడు, ఏ నెలలో పొందిన దాఖలాలు లేవు. ఉద్యోగులకు వేతనాలే ప్రధాన ఆదాయ వనరు గనుక ఆ పూచీకత్తుతో ఇంటికో, వాహనానికో, వ్యక్తిగత రుణమో, పిల్లల చదువుల కోసమో చేసిన అప్పుల ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకులో సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంది. బయట అప్పు అడగలేక ఆత్మన్యూనతతో ఉద్యోగ, ఉపాధ్యాయులు కాలం వెళ్ళ దీస్తుంది నిజంకాదా!. తెలంగాణ ధనిక రాష్ట్రమని, మిగులు బడ్జెట్‌, ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అంటూ ప్రచార గొప్పలే కాని వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఇది వాస్తవం కాదా! ట్రెజరీల్లో ఆమోదం పొందిన వివిధ రకాల బిల్లులు నెలల తరబడి పెండింగులో ఉన్నాయి. అంతేకాదు ఉద్యోగుల జీవితకాలం పొదుపు చేసుకున్న జిపిఎఫ్‌, టీఎస్జిఎల్‌ఐ క్లైములు, పెన్షనర్‌ బెనిఫిట్స్‌, పీఆర్సీ బకాయిలు తదితర బిల్లులు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి పీఆర్సీ గడువు 30 జూన్‌ 2023 తో ముగిసినా.. పూర్తిస్థాయిలో ఆ ఒప్పందాలు అమలు జరగలేదు. గత పీఆర్సీ లోనే 22 నెలల ఆర్థిక ప్రయోజనాలు నష్టపోయిన తీరు, మిగిలిన బకాయిలు రాని అను భవంతోనైనా వెంటనే 1జులై 2023 నుండి మధ్యంతర భతి సాధించుకోవడంతో పాటు, పీఆర్సీ కమిటీ వేసేలా ఒత్తిడి తేవాల్సి ఉంది. అధికారంలో ఎవరు ఉన్నా వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల హక్కులకు భంగం కలిగిస్తున్న తీరు ఈమధ్య ఎక్కువవుతుందని సగటు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతూ, ఉద్యోగ సంఘాల నాయకులపై గుర్రుగా ఉన్నారు.
గత కాలంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నిస్వార్థ సేవ, పోరాటాలు, త్యాగాల వల్ల సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటిగా సంఘాల నాయకుల ఉదాసీన వైఖరి మూలంగా కోల్పోవాల్సి వస్తుందంటూ ఆవేదన చెందుతున్నారు. సంఘ నాయకులుగా, ఎమ్మెల్సీలుగా బాధ్యతల్లో ఉన్నవారు, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమ స్యలను ప్రభుత్వ దష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించాల్సిన వాళ్లు? వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగ, ఉపాధ్యా యుల ఆత్మగౌరవాన్ని, పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను పణంగా పెట్టడం చూస్తుంటే బాధగా ఉందని పెన్షనర్లు, అనుభవజ్ఞులు నిర్ఘాంత పోవుచున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పాలన (ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి) కాలములో ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యతిరేక విధానాలకు పాల్పడినప్పుడు ఉమ్మడి ఉద్యమం చేసి స్ట్రైక్‌ను (సమ్మెకు పిలుపునిచ్చి) ప్రకటించి న్యాయమైన హక్కలను సాధించుకుని సమస్యలను పరిష్కరించుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ (ముఖ్య మంత్రి రాజశేఖర్‌ రెడ్డి) కాలంలో వారు అదేవిధంగా వ్యవహరిస్తే అదే తీరుగా ఉమ్మడి ఐక్య కార్యాచరణతో హక్కులను సాధించుకున్నారు. పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర గణనీయమైనదని, మరువలేనిదని నాడు పలికిన ఉద్యమ నాయకులే నేడు పాలకులైన వేళ కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను చూస్తుంటిమి కదా!అని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒక్కతాటి పైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణతో సాగాల్సిన సమయంలో మీనమేషాలు లెక్కిస్తూ, ఉదాసీనంగా ఉన్నారు. ఇది ప్రభుత్వాల మేలు కోసమా! ఉద్యోగుల బాగు కోసమా!! ఈ ద్వంద్వ విధానాలు ఎంత మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలు చేయవు గాక చేయవు.
ఒకవైపు ప్రజాసేవ పేరుతో ఐదేండ్లు పాలకులైన వారికి పెన్షన్లు, మరోవైపు 30 సంవత్సరాల పైబడి ఉద్యోగ సేవలందించిన వారికి నో పెన్షన్‌ ఇదేనా మీరు చెప్పే ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే? రేపో మాపో పీఆర్సీ, ఐ ఆర్‌ ప్రకటన అనే లీకులు ఇస్తూ కాలం వెళ్ళదీస్తుంది నిజం కాదా! రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌(సమస్య)లను పరిష్కరించాలి. పీఆర్సీ కమిటీ వేయాలి. 1 జులై2023 నుంచి ఐఆర్‌ అమలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేయడంలో ద్వంద్వ నీతిని వీడి ఓపిఎస్‌ను పునరుద్ధరించాలి. గత ఒప్పందంలోని పెండింగ్‌ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. బదిలీలు, పదో న్నతులు, హెల్త్‌కార్డులు.. ఇలా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమ స్యలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న వేళ.. ఇన్నాళ్ళ ఉద్యో గుల, ఉపాధ్యాయుల బాధ్యతాయుతమైన సేవల మూలంగా ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు,అవార్డులు వచ్చాయని మాటలు చెప్పడమే కాకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ (నోటిఫికేషన్‌) రాకముందే అన్ని సమస్యలు పరిష్కరించేలా వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలి. అవి కార్యరూపం దాల్చాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రజల నుండి వేరు చేసేలా దేశంలోనే ఎక్కువగా జీతాలు ఇస్తున్నామనే ప్రచారం ప్రభుత్వాలకు ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఎమ్మెల్సీలు మిమ్ముల్ని మోస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలి. ఇది కనీస బాధ్యతని మరువరాదు. పాలకులు బేషజాలకు పోకుండా వెంటనే ఉద్యోగ,ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి ధర్నాలు, ర్యాలీలకు వెళ్లకుండా చర్చల ద్వారా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన కనీస బాధ్యతను గుర్తెరగాలి.
(సెప్టెంబర్‌ 1 పింఛన్‌ విద్రోహ దినం)

– మేకిరి దామోదర్‌,
9573666650