– భారత ఐఖ్య యువజన రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
సభలు,సమావేశాలతో ఆర్భాటాలు చేయడం కాదు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసి అర్హులైన నిరుపేద కుటుంబాలకు అందజేయాలని భారత ఐఖ్య యువజన (యువైఏప్ఐ) రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం మండల కేంద్రంలో మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఆర్భాటం చేసి తొమ్మిదిన్నర ఎండ్లు మోసం చేయడం వల్ల ప్రజలు గద్దె దించారని గుర్తు చేశారు.ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం తరువాత ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, పింఛన్ పెంపు ఇస్తానని చెప్పి అనేక సర్వేలు,సభలతో కాలయాపన చేయడం సరికాదన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రాజకీయ పలుకు బడి ఉన్నవాళ్ళ, లంచాలు ఇచ్చిన అనర్హుల పేర్లు అధికారులు గ్రామసభల్లో ప్రకటించిన జాబితాల్లో వచ్చాయని, అర్హులైన వారి పేర్లు రాలేదని ఆరోపించారు. ప్రభుత్వం, సంబంధించిన ఉన్నతాధికారులు సంధించి నిజమైన అర్హత ఉన్నవారికి నాలుగు పథకాలు వర్తించేలా చర్యలు తీసుకొని, అనర్హులను జాబితాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే అర్హులైన పేదల పక్షాన భారత ఐక్య యువజన సమాఖ్య ఆందోళన చేస్తోందని హెచ్చరించారు.