ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో..14 మందికి షోకాజ్‌ నోటీసులు

– విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఫార్మసిస్ట్‌పై సస్పెన్షన్‌ వేటు
– పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్‌
నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ బీ. ఎం. సంతోష్‌ వైద్య సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మీికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సునిశితంగా పరిశీలించి అక్కడి పరిస్థితులు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలను క్షణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌లు ఎంత మంది నిర్దేశిత సమయానికి వచ్చారని రిజి స్టర్‌లో పరిశీలించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ట్యూ టర్లు 14 మందితో పాటు మరో నలుగురు వైద్య సిబ్బంది గైర్‌ హాజరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రతిరోజు వారి హాజరు వివరాలను తెలిపే బయోమెట్రిక్‌ యంత్రంలో గల వారి వివరాలను ప్రింట్‌ తీసి ఇవ్వాల్సిందిగా ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ కు కలెక్టర్‌ ఆదేశించారు. విధులను సరిగా నిర్వహించని 14 మందికి షోకాస్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఫార్మసి స్టోర్‌ తనఖీ చేసి స్టాక్‌ వివరాలు, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం పట్ల ఫార్మసిస్టును వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. కంటి వైద్య చికిత్సకు సంబంధించిన ల్యాబ్‌ ను పరిశీలించి, కంటి సమస్యలతో వచ్చే పేషెంట్లకు వెంటనే మెరుగైన చికిత్సలు అందించే విధంగా ఆపరేషన్‌ థియేటర్‌ ను జులై, 1 నుంచి పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 50 పడకల వార్డు లో పేషెంట్లను (పురుషులను) అందులోకి షిఫ్ట్‌ చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ఇన్‌ పేషెంట్‌, అవుట్‌ పేషెంట్స్‌ నమోదు వివరాలు తెలిపే రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డా. నవీన్‌ క్రాంతి , వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.