ఏ దేశ అభివృద్ధికైనా విద్య అనేది ముఖ్యమైన సాధనం.విద్య అనగా బోధన, అభ్యసనం ద్వారా ఒకతరం నుండి మరొక తరానికి అందించే జ్ఞానం, నైపుణ్యంతో పాటు విలువలను అందించే ప్రక్రియ. ఈ వికాస సాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులకు సహకారంగా ఉంటున్నవారే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు. అటు విద్యాశాఖ అధికారులకు, ఇటు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వారధిగా పనిచేస్తూ పాఠశాల విద్యా ప్రమాణాల పెరుగుదలకు చేసే కృషిలో వీరిది కీలకపాత్ర. కానీ వారి వేతన వెతలు మాత్రం తీరడం లేదు. గత రెండు దశాబ్దాలుగా చాలీచాలని జీతం, అరకొర సౌకర్యాల మధ్య పనిచేస్తున్న ఈ చిరుద్యోగులను కనికరించడం లేదు. క్రమబద్ధీకరణ చేయడం లేదు. అంతకన్నా ముఖ్యమైన ఉద్యోగ భద్రతనూ కల్పించడం లేదు. ఈ తరుణంలో సమస్యల పరిష్కారానికి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె సైరాన్ మోగించారు. తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 10 నుండి పెన్‌డౌన్ చేపట్టారు. అయినప్పటికీ సర్కార్‌లో చలనం లేదు. పదిరోజులు దాటినా వీరి సమస్యలపై చర్చించం లేదు.
కేంద్ర ప్రభుత్వం 2006లో రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టులో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది. జిల్లాస్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో రోస్టర్ మెరిట్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి కాంట్రాక్టు పద్ధతిలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19 వేలకు పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నారు. పన్నెండు విభాగాల్లో పనిచేస్తున్న ఈ ఉద్యోగులు ఎప్పటికప్పుడు పాఠశాల నివేదికల రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే పాఠశాల విద్యలో అన్ని రకాల నివేదికలను జిల్లా , మండల విద్యాశాఖ అధికారులకు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించడం చేస్తున్నారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ, రోజువారి పాఠశాలల సందర్శన, బడి బయట పిల్లల వివరాల సర్వేలు నిర్వహించడం మొదలైన విధులు నిర్వహిస్తూ విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా విద్యాశాఖలో వెట్టిచాకిరి చేస్తున్న సరైన వేతనాలు లేక చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నారు. జిల్లా మండల కాంప్లెక్స్, పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు రెగ్యులర్ టైం స్కేల్ ఇవ్వాలని అలాగే అందరు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, జీవిత బీమా రూ.పది లక్షలు, ఆరోగ్య బీమా రూ.పది లక్షలు ప్రతి ఉద్యోగికి కల్పించాలని వీరు కోరుతున్నారు అదేవిధంగా పదవి విరమణ చేసిన వారికి రూ. 25 లక్షలు ఇవ్వాలని, రి- ఎంగేజ్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వ,విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలని విన్నవిస్తున్నారు. వీరి న్యాయమైన కోర్కెలకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు, విద్యావంతులు, మేధావులు కూడా మద్దతునిస్తున్నారు.
గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 నవంబర్ 18న హనుమకొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ‘మీ న్యాయమైన కోరికల్ని మేము అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం’ అని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం అందిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన హామీల ఊసెత్తడం లేదు. ‘మేము కడుపు మండి నిరసన తెలుపుతూ ఉంటే విజయోత్సవాలు చేసుకుంటూ అధికారులు మమ్మల్ని పట్టించుకోవడంలేదని’ బాధిత ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల మధ్యాహ్న భోజనంలో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించి వారి చీకటి జీవితాల్లో వెలుగులు నింపాలి.
– అంకం నరేష్, 6301650324