అందరిపై ‘కారుణ్యం’ చూపండి

– టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీకి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సర్వీసులో వుండి చనిపోయిన ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం (బ్రెడ్‌ విన్నర్‌ స్కీం) కల్పించే విషయంలో ఖాళీలతో నిమిత్తం లేకుండా పెండింగ్‌ దరఖాస్తుల్లోని వారందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌కు వినతిపత్రం సమర్పించారు. సంస్థలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం చనిపోయిన కార్మికుడు, ఉద్యోగి కుటుంబంలో అర్హత కలిగిన ‘డిపెండెంట్‌’కు ఉద్యోగం కల్పించాలి. అయితే ప్రభుత్వంలో వున్న పద్ధతిలో ‘సూపర్‌ న్యూమరీ పోస్ట్‌’ సృష్టించి ఉద్యోగం కల్పించాల్సి ఉంటుంది. ఆర్టీసీలో మాత్రం ఉన్న ఖాళీల్లోనే ‘కారుణ్య’ నియామకాలు చేపట్టాల్సి ఉండేలా నిబంధనలు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసినందున ఈ నిబంధనల్లో మార్పులు తేవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు కోరారు. గత దశాబ్ద కాలంగా ఆర్టీసీ విస్తరణ ఆగిపోవడంతో ‘బ్రెడ్‌ విన్నర్‌ స్కీం’లో రెగ్యులర్‌ ప్రాతిపదికన కాకుండా, మూడేండ్ల కన్సాలిడేటెడ్‌ పే తో మాత్రమే తీసుకున్నారని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మహాలక్ష్మి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించాక సంస్థలో సిబ్బంది అవసరం పెరిగిందని చెప్పారు. ఈ నేపధ్యంలోనే బ్రెడ్‌ విన్నర్‌ స్కీం ద్వారా ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారిలో 800 మందిని కన్సాలిడేటెడ్‌ వేతనంపై తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అయితే నియామకం చేసే పోస్టులన్నీ రీజియన్‌ సీనియార్టీ పోస్టులు కాబట్టి, ఆయా రీజియన్లలో ఖాళీల మేరకు రిక్రూట్‌మెంట్లు జరుపుతామని చెప్తున్నారనీ, దీనివల్ల అర్హతలు ఉన్నా కొందరికే అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఖాళీలతో నిమిత్తం లేకుండా ఈ స్కీంలో దరఖాస్తులు చేసుకున్న వారందర్నీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు.