విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకుడు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఇది ఇండియానా జోన్స్ వంటి భారీ మూవీ. ట్రైబల్ నేపథ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైమ్‌లో జరిగే స్టోరీ ఇది. ఒరిజినల్‌గా, ఆ కథా నేపథ్యానికి తగినట్లు మ్యూజిక్ క్రియేట్ చేశాను. ఈ సినిమా కోసం 50 రోజులు రీ రికార్డింగ్ చేశాను. దర్శకుడు పా రంజిత్ విజన్‌ను అర్థం చేసుకుని అందుకు తగినట్లు మ్యూజిక్ అందించాను. సంగీత దర్శకుడిగా ఈ సినిమాకి వర్క్ చేయడం నాకు ఎంతో సంతప్తినిచ్చింది. టైటిల్ సాంగ్, మనకి మనకి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలే కాదు బీజీఎం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ కథలో ప్రేమ, కుట్ర, పోరాటం, కోపం వంటి ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని ఎలివేట్ చేసేలా, మరింతగా ప్రేక్షకులకు ఎఫెక్టీవ్‌గా రీచ్ చేసేలా బీజీఎం చేశాను. విక్రమ్ ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇందులో ఫీమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. పార్వతీ తిరువోతు, మాళవిక ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఏఐ సహా ఎన్నో కొత్త టెక్నాలజీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే టెక్నాలజీపైనే ఆధారపడటం సరికాదు. ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనే ఐడియా ఉండాలి’ అని తెలిపారు.