– అంబేద్కర్, ఫూలే స్ఫూర్తితో రంగరించి రాచినట్టుంది : శ్రీ శూద్ర గంగ వచనరూప కావ్యం ఆవిష్కరణలో పలువురు వక్తలు
– ఆ కావ్యం బహుజన గీతిక
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
శ్రీ శూద్ర గంగ స్వేద వేదమనీ, ఉత్పత్తి వర్గాలైన శ్రమజీవుల కావ్యగానం అని పలువురు వక్తలు కొనియాడారు. ఆ వచన కావ్యం బహుజన గీతిక అని నొక్కిచెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలోని దాశరథి ప్రాంగణం(హైదరాబాద్ బుక్ ఫెయిర్)లో గల బోయి విజయభారతి వేదికలో డాక్టర్ సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రీ శూద్ర గంగ వచనరూప కావ్యాన్ని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆవిష్కరించారు. ప్రొఫెసర్ వినోదిని మాదాసు అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణలో లోక కవి అందెశ్రీ, రచయిత సుద్దాల అశోక్‌తేజ, సినీ నటులు ఉత్తేజ్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ చింతకింది కాశీం, ప్రముఖ కవులు, విమర్శకులు బెల్లి యాదయ్య, కోయి కోటేశ్వరరావు, టీపీఎస్‌కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం పాశం యాదగిరి మాట్లాడుతూ…రియల్ ఎస్టేట్ రంగంలో భూములు ఆక్రమణలకు పాల్పడినట్టుగా దేశంలోని రకరకాల సిద్ధాంతాలు మనుషుల మధ్య చీలికలు తెస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుద్దాల అశోక్ తేజ రచనలో ఊహాత్మక అంశాలు కూడా వ్యూహాత్మకంగా ఉన్నాయని ప్రశంసించారు. ఉత్పత్తికారులపై ఆధారపడి జీవించే వాళ్ల నిజస్వరూపాన్ని తన రచనలో ఆవిష్కరించారన్నారు. డ్యాములు నిర్మించి నీళ్లను బంధించడం ద్వారా యూఎస్‌ఏలో సాల్మన్ చేప జాతి కనిపించకుండా పోయిందనీ, కారణమేంటని అధ్యయనం చేస్తే నిల్వ నీటిలో పోగైన బాక్టీరియానే కారణమని పరిశోధకులు తేల్చారన్నారు. ఈ నేపథ్యంలోనే యూఎస్‌ఏలో 2100 డ్యామ్‌లను అక్కడి ప్రభుత్వం కూల్చివేసిందని చెప్పారు. రాజకీయ నాయకులు, ఇంజినీర్లు తమ కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడుతూ పోతున్నారని విమర్శించారు. అవసరం లేకుండా కార్పొరేట్ల లాభాల కోసం మైనింగ్ పేరిట ప్రకృతి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారనీ, భూ తల్లికి వస్త్రం లాంటి ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నారని వాపోయారు. పాలకులు జనతంత్రాన్ని కోరుకోవడం లేదనీ, చోరతంత్రాన్ని కోరుకుంటున్నారని విమర్శించారు. నిపుణులు చూపుతున్నట్టు నదిలో ప్రతి పది కిలోమీటర్లకు ఒకసారి ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందన్నారు. లోక కవి అందె శ్రీ మాట్లాడుతూ..సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ కావ్యం భవిష్యత్తు తరాలకు దార్శనీకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. సుద్దాల అశోక్ తేజ లాంటి వాళ్లు సినీగేయాలు రాసుకుంటూ కూర్చోకుండా తాను పుట్టిన వర్గం మూలాల్లోకి వెళ్లి తనది నాలుగో వర్ణం అని ప్రకటించుకోవడం గొప్ప విషయం అన్నారు. 30 ఏండ్లు కష్టపడి ఎన్నో ప్రబంధాలు, పురాణాలు చదివి అవగాహన చేసుకుని తనలోని భావాలను ఏరికూర్చిందే శ్రీ శూద్ర గంగ అని కొనియాడారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ..చాలా స్పష్టమైన అవగాహనతో కావ్యానికి సుద్దాల అశోక్ తేజ శ్రీ శూద్రగంగ అని పెట్టారని కొనియాడారు. కాళ్ల నుంచి పుట్టిన గంగ శూద్రులదే అని చెప్పారన్నారు. ఈ కావ్యం దేశంలో ప్రత్యామ్నాయ ఆలోచనా విధానానికి మూలంగా మారుతుందని ఆకాంక్షించారు. ఆ కావ్యంలో వైజ్ఞానిక, పర్యావరణ, తాత్విక దక్పథం స్పష్టంగా కనపడిందన్నారు. ఆ కావ్యం బహుజనుల గీతిక అన్నారు. ప్రతి యూనివర్సిటీలో ఈ కావ్యాన్ని తనదైన గొంతుకతో చదివి వినిపించాలని అశోక్‌తేజను కోరారు. కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ..అంబేద్కర్, ఫూలే స్ఫూర్తితో తనలో సాహిత్యాన్ని రంగరించి రాసినట్టు ఈ కావ్యం ఉందని కొనియాడారు. కొత్త తాత్విక బాట వేసేందుకు సుద్దాల అశోక్ తేజ ఈ కావ్యం రాసినట్టు ఉందన్నారు. ఆ కావ్యంలో ద్రావిడ, మూలవాసుల సిద్ధాంతం దాగి ఉందన్నారు.