శ్రేయస్‌, శుభ్‌మన్‌ శతక్కొట్టారు

Shreyas Shubman scored a century– రాహుల్‌, సూర్య ధనాధన్‌
– అశ్విన్‌, జడేజా మాయజాలం
– రెండో వన్డేలో
భారత్‌ ఘన విజయం నవతెలంగాణ-ఇండోర్‌
శ్రేయస్‌ అయ్యర్‌ (105, 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (104, 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక విహారం. గిల్‌, అయ్యర్‌ ఇండోర్‌లో పరుగుల వరదకు అశ్విన్‌, జడేజా మ్యాజిక్‌ తోడటంతో రెండో వన్డేలో ఆసీస్‌పై భారత్‌ (డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (72 నాటౌట్‌, 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), కెఎల్‌ రాహుల్‌ (52, 38 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం అర్థ సెంచరీలు బాదటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 399/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో ఆస్ట్రేలియా చతికిల పడింది. 28.2 ఓవర్లలో 217 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలో పేసర్లు, ఆ తర్వాత స్పిన్నర్ల ముందు కంగారూ బ్యాటర్లు నిలువలేకపోయారు. ఈ విజయంతో వన్డే సిరీస్‌ 2-0తో భారత్‌ వశమైంది. సిరీస్‌లో మూడో మ్యాచ్‌ బుధవారం రాజ్‌కోట్‌లో జరుగనుంది.
ఆసీస్‌ చతికిల : 400 పరుగుల భారీ ఛేదనలో ఆస్ట్రేలియా చతికిల పడింది. ఏ దశలోనూ ఆసీస్‌ రేసులో నిలువలేదు. షార్ట్‌ (0), స్మిత్‌ (0), జోశ్‌ (6), అలెక్స్‌ (14), గ్రీన్‌ (19), జంపా (5)లు స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. మార్నస్‌ లబుషేన్‌ (27), డెవిడ్‌ వార్నర్‌ (53) టాప్‌ ఆర్డర్‌లో కాసేపు క్రీజులో నిలిచినా.. భారత బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు చేరక తప్పలేదు. 140 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకు సీన్‌ అబాట్‌ (54, 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), జోశ్‌ హాజిల్‌వుడ్‌ (23) తొమ్మిదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన భారత బౌలర్లను విసిగించారు. ఫీల్డింగ్‌ వైఫల్యం సైతం ఆసీస్‌కు కలిసొచ్చింది. 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆస్ట్రేలియా కుప్పకూలింది. భారత్‌ 99 పరుగుల తేడాతో గెలుపొందింది. అశ్విన్‌ (3/41), జడేజా (3/42), ప్రసిద్‌ కృష్ణ (2/56) వికెట్ల వేటలో విజృంభించారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 9 ఓవర్లలో 56/2తో ఉండగా వర్షం అంతరాయం కలిగించింది. డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం లక్ష్యాన్ని 33 ఓవర్లకు 317 పరుగులుగా నిర్దేశించారు.