శ్రేయస్‌కు సారథ్య పగ్గాలు

Shreyas takes over the reins of captaincy– పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం వెల్లడి
ముంబయి : ఇటీవల పొట్టి ఫార్మాట్‌లో సూపర్‌ సక్సెస్‌తో దూసుకెళ్తోన్న శ్రేయస్‌ అయ్యర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముచ్చటగా మూడో ప్రాంఛైజీకి సారథ్యం వహించనున్నాడు. 2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఆ ప్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. హిందీ బిగ్‌బాష్‌ రియాలిటీ షోకు సహచర పంజాబ్‌ కింగ్స్‌ క్రికెటర్లు యుజ్వెంద్ర చాహల్‌, శశాంక్‌ సింగ్‌లతో కలిసి హాజరైన శ్రేయస్‌ అయ్యర్‌.. పంజాబ్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపాడు. 2024 ఐపీఎల్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు కెప్టెన్సీ వహించిన శ్రేయస్‌.. ఆ జట్టుకు టైటిల్‌ అందించాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఆ జట్టును ఫైనల్లోకి తీసుకెళ్లాడు. ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కోసం ఎదురు చూస్తున్న పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ‘ పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం నాపై నమ్మకం ఉంచటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కోచ్‌ రికీ పాంటింగ్‌తో పని చేసేందుకు ఎదురు చూస్తున్నాను. ప్రతిభావంతులు, సత్తా చాటిన ఆటగాళ్ల మేళవింపుతో జట్టు చాలా బాగుంది. తొలి ఐపీఎల్‌ టైటిల్‌తో పంజాబ్‌ కింగ్స్‌ నమ్మకాన్ని నిలుపుకుంటానని ఆశిస్తున్నాను’ అని శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు.