అక్షర వైజయంతి ‘స్వాతి శ్రీపాద’కు ‘శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం’

Akshara Vyjayanti to 'Swati Sripada' 'Shrimati Sushila Narayana Reddy Award'దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు నేల మీద ప్రతిభామూర్తులైన స్త్రీమూర్తులను సత్కరిస్తూ, ప్రతిష్టాత్మక ‘శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం’ అందిస్తోంది సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు. మహాకవి, భారతీయ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి సతీమణి సుశీలమ్మ పేర కుటుంబ సభ్యులు 1984లో ప్రారంభించగా, తొలి పురస్కారం విధూషీమణి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మకు అందించారు. ఇప్పటిదాకా నలభై ఒక్క మంది విద్వన్మణులైన స్త్రీ మూర్తులకు ఈ పురస్కారాన్ని అందించగా దీన్ని ‘రసమయి’ తన వేదిక మీద నిర్వహిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం 2025కు గాను ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, తెలుగు ఆంగ్ల భాషానువాదకులు, విశ్రాంత కేంద్రీయ విద్యాలయ ఆంగ్లోపాధ్యాయిని స్వాతి శ్రీపాదకు దక్కింది.
నాలుగు దశాబ్ధాలుగా రచనలు చేస్తున్న స్వాతి శ్రీపాద, మరో ముగ్గురు కవులు తమ తొలి రచనలు ఇందూరు భారతి ద్వారా అచ్చువేశారు. స్వాతి శ్రీపాద నిజామాబాద్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఈ సంకలనం వచ్చింది. స్వాతితో ఇందులో కవిత్వం తెచ్చిన ఆనాటి నిజామాబాద్‌ నవ యువ కవులు ఏ.సూర్యప్రకాష్‌, సైబ, బద్దూరిలు. ‘చౌరస్తా’ పేరుతో వచ్చింది. కవుల ముఖ చిత్రాలతో సైక్లోస్టైల్‌ ప్రింటు రూపంలో వచ్చిన ఈ కవితా సంకలనం ఆనాటి తెలంగాణ యువ కవుల బలమైన సంతకాల్లో ఒకటి. 1970 నుంచి కవిత్వం రాస్తున్న స్వాతి శ్రీపాద నిరంతరం కవిత్వం, ఇతర ప్రక్రియల్లో రచనా వ్యాసంగం నిర్వహిస్తున్నప్పటికీ ఉద్యోగరీత్యా వాటిని మరో రెండు దశాబ్దాల వరకు పుస్తకంగా తేలేదు. అటు తరువాత వెనుతిరిగి చూడలేదు. ఇప్పటి వరకు ఎనమది కవితా సంపుటాలు, ఆరు కథా సంపుటాలు, ఎనిమిది నవలలు, నలభైకి పైగా వివిధ భాషల్లోంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఆంగ్లలోకి అనువాదాలు అచ్చయ్యాయి. తొలి యువ కవుల కవిత్వం చౌరస్తా తరువాత ఏర్చికూర్చిన కొన్ని కవితలను ‘హృదయంలో అడుగులు’ పేరుతో ప్రచురించింది స్వాతి. అటు తరువాత ‘మనసుకు చూపుంటే…’, ‘ఎడారులు, ఎండ మావులు’, ‘సుప్తక్షణం’, ‘పోతబొమ్మ’, ‘కలలకు కాలం చెల్లింది’ తెలుగు కవితా సంపుటాలు. ‘వాకింగ్‌ టుగెదర్‌’ పేరుతో ఆంగ్ల కవితా సంపుటి వచ్చాయి. ‘మూగవీణ’, ‘అవతలివైపు’, ‘పొరలు’, ‘పంజరం విడిచి’, ‘మల్లెలు-కనకాంబరాలు’ స్వాతి ప్రచురించిన కథా సంపుటాలు. ‘పడమటి సూర్యోదయం’, ‘అపరిష్కృతం’, ‘పునరాగమనం’, ‘శిశిర వసంతం’, ‘చుక్కాని దీపం’, ‘జీవన వేదం’, ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’, ‘ఎక్కడి నుంచి ఇక్కడి దాకా..’ అచ్చయిన నవలా సాహిత్యం. నలభైకి పైగా తెలుగు, ఇంగ్లీష్‌లో చేసిన అనువాదాల్లో సాహిత్య అకాడమి, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా వంటి సంస్థలతో పాటు డా.సినారె, డా.ఎన్‌.గోపి, కె.శివారెడ్డి మొదలు నేటి నవ యువతరం రచయితలు, కవుల రచనలను ఆంగ్లంలోకి చేశారు. తెలుగులోకి ఆంగ్లం, హిందీ నుంచి తెచ్చినవి, బాల సాహిత్య అనువాదాల సంఖ్య ఎక్కువే.
కవయిత్రిగా స్వాతి శ్రీపాదది విలక్షణ అభివ్యక్తి, చక్కని భావ చేతన. దీనిని తొలి కవిత్వం నుంచి నేటి దాకా తన రచనల్లో చూపుతారామె. ముఖ్యంగా ‘సుప్త క్షణాలు’ కవితా సంపుటి చూస్తే స్వాతి అభివ్యక్తి, శిల్పం తెలుస్తుంది. ‘ఒక్కడ ఎవరైనా ఒకటే’ కవితా సంపుటి కూడా ఇలాంటిదే. ఇందులోని ప్రతి కవిత పదునైన భావచిత్రాలకు ఆలవాలంగా నిలుస్తుంది. దీనికి సిరికోస సిలీకాన్‌ వ్యాలీ బహుమతి వచ్చింది. తనకు తారసపడిన అనేక సంఘటనలు, సందర్భాలను, తన మస్తిష్కాన్ని తొలచిన అంశాలను కవయిత్రి ఇందులో కవిత్వంగా మలిచింది.
కథా, నవలా రచయిత్రిగా స్వాతి శ్రీపాద ప్రతి అక్షరంలో సామాజిక సమస్యలు, సంఘర్షణ లను, తన మనసులోని అలజడులను కథలుగా మలిచింది. ఒకటని కాదు ప్రతి సంపుటి అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. విహారి కితాబు ఇచ్చినట్టు ‘కథా సంవిధానాన్ని ఇడుపుగా పట్టుకున్న నేర్పరి’ స్వాతి శ్రీపాద. మానవ జీవనంలోని అనేక పార్శ్వాలను ఎంత బాగా తన రచనల్లో వ్యక్తీకరించారో అమలిన శృంగారతత్త్వాన్ని కూడా తన రచనల్లో చక్కగా చెబుతారీమె. అందుకు స్వాతి రాసిన ‘నీ కోసమె… నే’ అనే కథ ఉదాహరణ. స్వాతి కథా కథన కౌశాలానికి, నిర్వహణతో పాటు చక్కని ఉహకు ఈ కథను మేలిమిరాయిగా పట్టి చూపొచ్చు. వీరి అనేక కథలు మధ్యతరగతి నేపథ్యాన్ని, అందులోని సాధకబాధకాల్ని వ్యాఖ్యానిస్తాయి. వాటికి కొన్నిసార్లు తాను పుట్టి పెరిగిన నిజామాబాద్‌ నేపథ్యంగా నిలిస్తే మరికొన్నింటికి తాను పనిచేసిన ఇతర రాష్ట్రాల్లోని భాషా ప్రదేశాలు ఆకారాలవుతాయి. మరికొన్ని తాను నివసిస్తూ నిత్యం చూస్తున్న అపార్టుమెంట్‌ జీవితాలు, అమెరికా జీవితాలను చూపిస్తే… కొన్ని కథలు సమాజంలోని అనేక డొల్లలను మనకు వెక్కిరిస్తూ కనిపిస్తాయి. వీరి ‘క్లాష్‌’ కథను ఒకసారి మనం చూసినట్టయితే అది అనేకానేక అంశాలకు అతి పెద్ద కాన్వాస్‌గా మనకు కనబడుతుంది. కథను చెప్పనుగానీ కథలోని ప్రధాన పాత్రతో రచయిత్రి చెప్పించిన తీరు అదేంటో మనకు క్షణంలో అర్థమవుతుంది. ఇక స్వాతి శ్రీపాద నవలల విషయానికి వస్తే అన్నీ కూడా సమాజం తీరుతెన్నుల్ని, జీవితాలను ప్రతిబింభించేవే. ఎనిమిది నవలల్లో దేని విశిష్టత దానిదే అయినా, నవలా రచయిత్రిగా స్వాతిని విలక్షణంగా నిలబెట్టేది మాత్రం ‘పురాగమనం’ నవల. చదువుకున్న, నగరజీవులైన ఒంటరి మహిళగా కథానాయిక పాత్రను స్వాతి తీర్చిదిద్దిన విధానం అనితరసాధ్యంగా చెబుతారు ‘దేరా’. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యం సంఘర్షణలకు లోనయ్యే ఆధునిక మహిళ అంతరంగం ఇది.
కవయిత్రిగా, కథా రచయిత్రిగా, అనువాదకులుగా దశాబ్ధాలుగా తన ముద్రను వేసి, తనదైన సంతకాన్ని స్థిరపరచుకున్న స్వాతి శ్రీపాదకు ప్రతిష్టాత్మక సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం లభించడం ప్రతిభకు అందిన అరుదైన గౌరవం, మరో తెలంగాణ సాహితీమూర్తికి దక్కిన స్ఫూర్తి పురస్కారం.

(ఈ రోజు రవీంద్ర భారతిలో సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా…)
– డా. పత్తిపాక మోహన్‌, 9966229548