శుభ్‌మన్‌ ఏ 2

Shubman A 2– ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు ముగ్గురు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌తోపాటు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ టాప్‌-10లో నిలిచారు. శుభ్‌మన్‌ గిల్‌ 759 రేటింగ్‌ పాయింట్లతో కెరీర్‌ బెస్ట్‌ రెండో స్థానంలో నిలువగా.. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అజేయ సెంచరీతో రాణించిన విరాట్‌ కోహ్లీ 715 రేటింగ్‌ పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆసియాకప్‌లో మూడు అర్ధ సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 707 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానం నిలిచాడు. 2019లో తొలిసారి భారత ఆటగాళ్లు ముగ్గురు టాప్‌-10లో చోటు దక్కించుకోగా.. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి ముగ్గురు టాప్‌-10లో నిలవడం విశేషం. 2019లో శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టాప్‌-10లో నిలిచారు. ఇక పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 863 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇమాన్‌ ఉల్‌ హక్‌(735పాయింట్లు) ఒక స్థానం పడిపోయి ఐదో స్థానంలో, ఫకార్‌ జమాన్‌(705పాయింట్లు) మూడు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయారు.
అనిల్‌ కుంబ్లే రికార్డు బద్ధలు కొట్టిన కుల్‌దీప్‌
ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా లెగ్‌స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు పడగొట్టి వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు భారత్‌ తరఫున వేగంగా 150 వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. కుల్దీప్‌ యాదవ్‌ 88 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు అందుకున్నాడు. దీంతో అనిల్‌ కుంబ్లే పేర (106 మ్యాచుల్లో 150వికెట్లు) ఉన్న రికార్డు బద్ధలైంది.