శుభ్‌మన్‌కు డెంగీ జ్వరం

Shubman has dengue fever– ఆసీస్‌తో పోరుకు అనుమానమే!
చెన్నై : 2023 ప్రపంచకప్‌ వేటలో ఆతిథ్య టీమ్‌ ఇండియాకు ఆరంభంలోనే అవాంతరం ఏర్పడింది. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన, గత నాలుగు వన్డేల్లో ఏకంగా రెండు సెంచరీలు, ఓ అర్థ సెంచరీ సాధించిన యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డెంగీ జ్వరం బారిన పడ్డాడు. తిరువనంతపురం నుంచి చెన్నైకి వచ్చిన టీమ్‌ ఇండియా రెండు రోజులుగా చెపాక్‌లో సాధన చేస్తుంది. కానీ శుభ్‌మన్‌ గిల్‌ మాత్రం ప్రాక్టీస్‌ సెషన్‌కు రాలేదు. సాధారణ జ్వరంతో బాధపడుతున్నాడని తొలుత భావించినా.. గిల్‌ డెంగీ ఫీవర్‌ బారిన పడ్డాడని బీసీసీఐ వైద్య బృందం నిర్ధారించింది. ప్రస్తుతం గిల్‌ బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. భారత్‌, ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ పోరు అక్టోబర్‌ 8న చెన్నైలో జరుగనుంది. గిల్‌ ఆరోగ్యం కుదుటపడకుంటే.. ఆసీస్‌తో మ్యాచ్‌కు అతడు అనుమానమేనని తెలుస్తోంది. ‘ గిల్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. రోజు రోజుకు అతడు మెరుగవుతున్నాడు. మ్యాచ్‌కు ఇంకా సమయం ఉంది. అప్పుడే గిల్‌పై ఏ నిర్ణయానికి రాలేదు. మ్యాచ్‌ రోజే గిల్‌ ఆడేది లేనిది తెలుస్తుంది. గిల్‌ ఆరోగ్యం మెరుగవుతుంది.. అదే అతిపెద్ద సానుకూలత’ అని భారత చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ అనారోగ్యంతో తొలి మ్యాచ్‌కు దూరమైతే.. ఇషాన్‌ కిషన్‌, కెఎల్‌ రాహుల్‌లలో ఒకరు ఓపెనింగ్‌ చేయనున్నారు. గిల్‌ ఈ ఏడాది వన్డేల్లో 72.35 సగటు, 105.03 స్ట్రయిక్‌రేట్‌తో 1230 పరుగులు పిండుకున్నాడు. ఇషాన్‌ కిసన్‌, కెఎల్‌ రాహుల్‌ ఇటీవల ఆసియా కప్‌, ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.