శుభ్‌మన్‌ శతక్కొట్టినా..!

Shubman scored a century..!– ఛేదనలో భారత్‌ పరాజయం
– సూపర్‌4లో బంగ్లాకు ఊరట విజయం
కొలంబో : శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ (121, 133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగినా ఛేదనలో టీమ్‌ ఇండియా చతికిల పడింది. 266 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 49.5 ఓవర్లలో 259 పరుగులకే కుప్పకూలింది. 6 పరుగుల తేడాతో గెలుపొందిన బంగ్లాదేశ్‌ ఆసియా కప్‌ సూపర్‌4 ఊరట విజయం సాధించింది. ఓటమితో టీమ్‌ ఇండియా ఫైనల్స్‌కు చేరుకోగా.. గెలుపుతో బంగ్లాదేశ్‌ ఇంటిముఖం పట్టింది. రోహిత్‌ (0), తిలక్‌ వర్మ (5), రాహుల్‌ (19), కిషన్‌ (5), జడేజా (7), సూర్యకుమార్‌ యాదవ్‌ (26) నిరాశ పరిచినా.. ఓ ఎండ్‌లో గిల్‌ నిలబడ్డాడు. అక్షర్‌ పటేల్‌ (42, 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చేలా కనిపించినా.. ఆఖర్లో బంగ్లాదేశ్‌ పుంజుకుంది. భారత్‌ను ఆలౌట్‌ చేసి ఊరట విజయం దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (80, 85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), తౌహిద్‌ (54, 81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్య, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతి లభించగా.. తెలుగు తేజం తిలక్‌ వర్మ వన్డే అరంగ్రేటం చేశాడు. కొత్త బంతితో భారత పేసర్లు చెలరేగారు. షమి, శార్దుల్‌ వికెట్ల వేటలో దూకుడు చూపించారు. దీంతో 59 పరుగులకే బంగ్లాదేశ్‌ 4 వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్‌ 150 పరుగులు చేయటం చేసినా గొప్పే అనిపించింది. కానీ కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (80), తౌహిద్‌ (54), నసుం అహ్మద్‌ (44), మెహిది హసన్‌ (29)లు భారత బౌలర్లను ఎదురొడ్డి పరుగుల వేట సాగించారు. దీంతో బంగ్లాదేశ్‌ 265 పరుగుల మంచి స్కోరు నమోదు చేసింది. హసన్‌ (13), లిటన్‌ దాస్‌ (0), అనాముల్‌ (4), మెహిది మిరాజ్‌ (13), షమిమ్‌ (1)లు విఫలమయ్యారు. శార్దుల్‌ ఠాకూర్‌ (3/65), మహ్మద్‌ షమి (2/32) మెరువగా.. ప్రసిద్‌ కృష్ణ, అక్షర్‌, జడేజా తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.