శ్యాం పిట్రోడా నాకు రోల్‌ మోడల్‌

Shyam Pitroda is my role model– రీడిజైన్‌ ద వరల్డ్‌ తెలుగు అనువాద పుస్తకావిష్కరణలో : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
టెలీ కమ్యూనికేషన్‌ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యాం పిట్రోడా తనకు రోల్‌ మోడల్‌ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని హౌటల్‌ తాజ్‌కృష్ణలో ప్రముఖ రచయిత శ్యామ్‌ పిట్రోడా రచించిన రీ డిజైన్‌ ద వరల్డ్‌ను తెలుగులో ‘ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం..కదలిరండి’ పేరుతో అనువాదం చేసిన పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం పల్లంరాజు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌, ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌రావుతో కలిసి భట్టి ఆవిష్కరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ఈ పుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. సమాజంలో అసమానతలు పెరగడం హానికరమని రచయిత విశ్లేషణాత్మకంగా వివరించారని తెలిపారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం, చైతన్యవంతమైనవని చెప్పారు. తెలంగాణ ప్రజల కలలు ఆశలు నెరవేర్చడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి సాంకేతికంగా, మేధో పరంగా సహకారం అందించడానికి తెలంగాణకు రావాలని శ్యాం పిట్రోడాకు విజ్ఞప్తి చేశారు. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని చాలా దగ్గరగా తీసుకురావడానికి టెలీ కమ్యూనికేషన్‌ ద్వారా భారీ విప్లవాన్ని శ్యామ్‌ పిట్రోడా తీసుకొచ్చారని తెలిపారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పిట్రోడా విద్యార్థిగా చదువుతున్న సమయంలో తన ఇంటికి ఫోన్‌ చేయడానికి జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో ట్రంక్‌ కాల్‌ బుక్‌ చేసి గంటల తరబడి నిరీక్షించి ఫోన్‌ చేసి మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. క్వాడ్‌ జెన్‌ వైర్‌ లెస్‌ సొల్యుషన్స్‌ చైర్మెన్‌ సీఎస్‌ రావు మాట్లాడుతూ, ‘రీడిజైన్‌ ది వరల్డ్‌’ పుస్తకం ప్రపంచ క్రమం ఎలా, ఎందుకు మారాలి, హైపర్‌ కనెక్టివిటీ ప్రపంచాన్ని ఎలా మార్చగలదో సూచిస్తోందన్నారు. ఈ తెలుగు అనువాదాన్ని పి.ఎన్‌.రావు తన అద్భుతమైన కృషితో, ఎమెస్కో ప్రచురణ సంస్థ సహకారంతో చేశారని తెలిపారు. తనకు తెలుగు అనువాద హక్కులు ఇచ్చినందుకు శ్యామ్‌ పిట్రోడాకు కృతజ్ఞతలు తెలిపారు.
”రీడిజైన్‌ ది వరల్డ్‌” పుస్తకంపై శాం పిట్రోడా ఓవర్‌ వ్యూ (బాక్సు ఐటమ్‌)
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డెమోక్రటైజేషన్‌, వికేంద్రీకరణ, డీమానిటైజేషన్‌ అనే ప్రత్యేక కోణాలు ప్రపంచ వ్యవస్థను మార్చేందుకు దోహదపడ్డాయని జూమ్‌ కాల్‌ ద్వారా శ్యాం పిట్రోడా చెప్పారు. ఇంటర్నెట్‌ ద్వారా ప్రజాస్వామ్యీకరణ అందరికీ జ్ఞానం, విద్య, వినోదం, షాపింగ్‌, బ్యాంకింగ్‌, ఆరోగ్య సంరక్షణ, రవాణాకు వికేంద్రీకృత అందుబాటును ఈ కొత్త ప్రపంచంలో హైపర్‌ కనెక్టివిటీ ద్వారా అనుమతిస్తుందని తెలిపారు. డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లు మన సమాజం, నాగరికతల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. భారతదేశంలో ఆర్థికాభివృద్ధి, నిర్మాణాత్మక మార్పు, జనాభా, డిజిటల్‌ డివిడెండ్‌ సామర్ధ్యంతో ప్రపంచ క్రమంలో భారతదేశం ప్రాముఖ్యత ప్రపంచ పునర్నిర్మాణ ఆవశ్యకత భావనగా హైలైట్‌ అవుతున్నదని తెలిపారు. సరికొత్త, అత్యంత క్రియాశీల యువ భారతదేశంలో డిజిటల్‌ నైపుణ్యాల ద్వారా డిజిటల్‌ అక్షరాస్యతను వేగంగా స్వీకరించడం ద్వారా భారతదేశం నిజమైన డిజిటల్‌ ప్రజాస్వామ్యానికి సిద్ధంగా ఉందన్నారు. శ్యాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా, డాక్టర్‌ డి. చంద్రశేఖర్‌ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు. ఈ పుస్తకావిష్కరణలో పరకాల ప్రభాకర్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఐపీఎస్‌ అధికారులు వి.వి. లక్ష్మీనారాయణ, ఎన్‌. సాంబశివ రావు, ఐఏఎస్‌ కె.ఎన్‌.కుమార్‌ పాల్గొన్నారు.