– ప్రజా పోరాటాలు నిర్వహించడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి
– మిడియం బాబురావు, మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
అమర జీవి కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి జీవితం నేటి తారానికి ఆదర్శమని, ప్రజా పోరాటాలు విస్తృతంగా నిర్వహించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. శ్యామల వెంకటరెడ్డి 27వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో వారు మాట్లాడుతూ ఉమ్మడి భద్రాచలం డివిజన్ ఉద్యమ నిర్మాతల్లో కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి ఒకరు అని అన్నారు. ఆయన భద్రాచలం డివిజన్‌లో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, తప్పుడు తూకంతో రైతులను దోపిడీ చేసే విధానానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. రైతు పోరాటాలతో పాటు వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని జరిగిన వర్గ పోరాటాలకు ఆయన అండగా నిలిచేవారని అన్నారు. భద్రాచలం ఏజెన్సీలో గిరిజనులు, గిరిజనేతర పేదల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడారని అన్నారు. భద్రాచలం డివిజన్ ఉద్యమంలో ఆయన ఓ ఆణిముత్యమని కమ్యూనిస్టు యోధుడని వారు కొనియాడారు. రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేని శత్రువులు మావోయిస్టు గుండాలతో చేతులు కలిపి అత్యంత దారుణంగా హత్య చేశారని అన్నారు. నేటి పరిస్థితులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు నిర్వహించడమే వెంకటరెడ్డికి మనం ఇచ్చే ఘన నివాళి అని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, రమేష్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, నాదళ్ళ లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు బి.కుసుమ, నాయకులు శ్యామల భాస్కర్ రెడ్డి, సత్య, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.