చిన్నారిపై ఎస్‌ఐ లైంగికదాడి

– కానిస్టేబుల్‌ కూతురి పైనే అఘాయిత్యం
– అరెస్టు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు
– రాజస్థాన్‌లో ఘటన
జైపూర్‌ : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఒక పోలీసు అధికారే.. లైంగికదాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్‌ కూతురైన నాలుగేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని దౌసాలో జరిగింది. దీంతో నిందితుడిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడైన సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ భూపేంద్ర సింగ్‌పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌, ఐపీసీలోని సెక్షన్‌ 376 కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. బాధితులు, అధికారుల కథనం ప్రకారం.. భూపేంద్ర సింగ్‌ను ఎన్నికల విధుల కోసం రహువాస్‌ పోలీస్‌ స్టేషన్‌లో నియమించారు. రాష్ట్రంలో నవంబర్‌ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నిందితుడు తన సహౌద్యోగి(కానిస్టేబుల్‌) గదికి వెళ్లి బాలికను తన వసతి గృహంలోకి రప్పించాడు. అక్కడ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తన తల్లికి జరిగిన దాడి గురించి చెప్పింది. జైపూర్‌లో విధుల్లో ఉన్న బాలిక తండ్రి ఇంటికి తిరిగి వచ్చి అతనిపై ఫిర్యాదు నమోదు చేయడానికి రహువాస్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత సింగ్‌ను అరెస్టు చేశారు. ”బాధిత బాలిక కచ్చితమైన వయస్సును వైద్య పరీక్షల తర్వాత, బాధితురాలి కుటుంబ సభ్యుల నివేదిక ఆధారంగా నిర్ణయిస్తారు. అంచనా ప్రకారం బాలిక వయస్సు నాలుగేండ్లు” అని దౌసా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వందిత రాణా తెలిపారు. కాగా, ఈ ఘటన రాజస్థాన్‌లోని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇటు దళిత, మహిళా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి.