బాల వికాస కార్యక్రమాల్లో సిద్ధిపేటకు పెద్దపీట

Siddipet is the leader in child development programsఇవ్వాళ్ళ తెలుగు బాలలు బడి దశలోనే కవిత్వపు వెన్నెల వానలు, కథల వెలుగుపూలతో పాటు అన్ని ప్రక్రియలు, రూపాల్లో తమ వికసిత ప్రతిభను పుస్తకాలుగా, సంచికలుగా ప్రచురిస్తున్నారు. ఈ పదేండ్లలో తెలుగు బాలల రచనలు 460కి పైగా అచ్చుకాగ ‘నవకవితల నజరానా’ అయిన తెలంగాణ నుండి 360 కి పైగా వయ్యిలు గోల్కొండ మినార్‌ మీద జండాల్లా ఎగిరాయి. గరిపెల్లి అశోక్‌ వంటి బాల వికాసకారుల స్వప్నసాకారం దిశగా అనేక మంది బాల సాహిత్య వికాసకారులు ఇవాళ్ల తెలంగాణ నేలమీద అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. అలా దాదాపు దశాబ్దం కాలంగా పిల్లలతో కలిసి పనిచేస్తూ సిద్ధిపేటకు బాల వికాస కార్యక్రమాల్లో పెద్దపీట వేసిన హిందీ ఉపాధ్యాయుడు, కవి, పత్రికా నిర్వాహకుడు, రచయిత, కార్యకర్త, బాల సాహిత్య వికాసకారుడు బైతి దుర్గయ్య. ఈయన ‘బైతి దుర్గమ్‌’ పేర రచనలు చేస్తున్నారు.
బైతి దుర్గయ్య సిద్ధిపేట జిల్లా రామునిపట్లలో 5 ఆగస్ట్‌, 1974న పుట్టారు. శ్రీమతి బైతి జానవ్వ, శ్రీ భూమయ్యలు వీరి తల్లిదండ్రులు. అక్షర సేద్యం సంస్థతో తొలినాళ్ళలో సాహిత్య సేద్యానికి అనేక మంది విద్యార్థులకు ప్రేరణ కలిగించిన దుర్గయ్యకు బంగారానికి తావి లాగా సుగుణ సాహితీ సంస్థకు భూమికగా నిలిచిన ముసర్ల మాధవరెడ్డి తోడుకావడంతో జక్కాపూర్‌ బడి సిద్ధిపేట జిల్లాలో అనేక బాలల పుస్తకాలు, కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. సుగుణ సాహితీ సంస్థ కన్వీనర్‌గా, ఉపాధ్యాయునిగా జక్కాపూర్‌ దుర్గయ్య కార్యక్షేత్రమేంది. పనిచేసిన ప్రతిచోటా తనదైన పద్ధతిలో నడిచే దుర్గయ్య ‘అక్షర’ పత్రిక రాజగోపాల్‌పేట బడి నుండి తెచ్చారు. జక్కాపూర్‌ బడి నుండి దుర్గయ్య తెచ్చిన తన సంపాదకత్వంలో తొలి సంకలనం ‘జక్కాపూర్‌ బడి పిల్లల కథలు’, వేయికి పైగా ప్రతులు అమ్ముడవడం ఈ వయ్యి విశేషం. ఈయన సంపాదకత్వంలోనే వచ్చిన బడి బాల బాలికల కవితా సంకలనం ‘మధుర పద్మాలు’. ఇది 74 మంది విద్యార్థుల కవితల పుస్తకం. వివిధ పత్రికల్లో అచ్చయిన 120 బడి పిల్లల బొమ్మలను ‘జక్కాపూర్‌ జక్కనలు’ గా అచ్చులోకి తీసుకు వచ్చాడు. తెలుగు బాల సాహిత్య కారులను ఒకచోట చేర్చేందుకు ‘బాల చెలిమి’ నిర్వహించిన ‘బాల చెలిమి ముచ్చట్లు’ కార్యక్రమం దుర్గయ్య బడి ఆతిథ్యంలో జక్కాపూర్‌లో జరిగింది. తన సంపాదకత్వంలో అక్షర సేద్యం త్రైమాసిక పత్రికను ప్రారంభించి బాలల రచనలకు పెద్దపీట వేస్తున్నారు దుర్గయ్య.
బాల వికాస కార్యమ్రాలతో పాటు రచయితగా, కవిగా దుర్గయ్య తెలుగు పాఠకులకు పరిచితులు. 2014లో ‘అక్షర సేద్యం’ పేర తన తొలి కవితా సంపుటిని తెచ్చిన వీరు 2017లో మరో వచన కవితా సంపుటి ‘అలుకు మొలుకలు’ ప్రచురించారు. ఇటీవల వచ్చిన వ్యాస సంకలనం ‘ఆరుగాలం పంట’. కథా రచయితగా పలు పత్రికలు సంస్థల బహుమతులు గెలుచుకున్న దుర్గయ్య ప్రతిష్టాత్మక రంజని కథా పురస్కారం అందుకున్నారు. బాల సాహిత్య రచనలో పెందోట బాల సాహిత్య పీఠం పురస్కారం, బాల వికాసకారునిగా ‘తెలుగు సాహిత్య కళాపీఠం బాల సాహిత్య వికాస పురస్కారం’ అందుకున్నారు.
బడి పిల్లల కోసం కథలు, గేయాలు రాసిన దుర్గయ్య ‘రామసక్కని గాలిపటం’ పేరుతో తొలి బాలల కథా సంపుటి తెచ్చారు. పిల్లలను మంచికి నడిపించి, మానవీయ విలువులను నేర్పే సాధనాలుగా ఆయన తన రచనలు మలిచారు. సమకాలీన బాలల విషయాలు, వాళ్ళ సమస్యలు ఇందులోని కథల ఇతివృత్తాలు. తెలంగాణ ప్రాంతంలో పుట్టిపెరిగిన దుర్గయ్యది వ్యవసాయ నేపథ్యపు కుటుంబం. దానిని తొలి కథ ‘మొదటి అడుగు’లో చెప్పారు రచయిత. ప్రాంతీయంగా ఉండే వనరులు, వాటి పట్ల పిల్లల చేతన వంటివి ఈ కథలో చెప్పడం బాగుంది. చివరకు బాలలు అన్నిరంగాల్లోనూ రాణించాలన్న నేపథ్యంగా గ్రామ సర్పంచ్‌గా చేయడం మలుపు. కోవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ పాఠాలు, టీ.విల్లో వచ్చిన పాఠాల గురించి మనకు తెలుసు, దానినే దిగువ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం చెప్పిన కథ ‘ఆన్‌లైన్‌ క్లాస్‌’. ఇందులోని అనేక అంశాలు మనం మన చుట్టుపక్కల్లో చూసినవే. ‘గురువు చూపిన దారి’ మంచి కథ. మార్గదర్శకుడై ఉపాధ్యాయుని బాటలో నడిచిన విద్యార్థి మళ్ళీ ఉపాధ్యాయుడు కావడం ఇందులో చూడొచ్చు. ఇటువంటి సందర్భాలు అనేక మందిగురువులకు ఎదురవుతుంటాయి. ‘ముసలినాన్న’ మానవ సంబంధాలకు అద్ధం పట్టే మరో మంచి కథ. ఇదులోని ‘సార్మినార్‌’ కథ భాషా సౌందర్యంతో పాటు అమాయక పిల్లలు, పల్లెటూరి పిల్లల చిన్నచిన్న కోరికలను తెలుపుతుంది. ముగింపుగా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిన విద్యార్థి తిరిగి ఇంటికి రావడం బాగుంది. అటు బాల వికాస కార్యక్రమాలతో పాటు, బాల సాహిత్యరచనలోనూ ముందునిలిచిన బైతి దుర్గమ్‌ కు అభినందనలు. జయహౌ! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548