అగ్నిశిఖల సంకేతం ..

అలిశెట్టిది
ఆకలిదప్పుల సహజీవన నేపథ్యమే ..
ఐతేనేం
అగ్నిశిఖల సంకేతమై
చీకటికోణాల రహస్య ఛేదకుడయ్యిండు ..

సమాజ నగ్న దేహానికి
పదునైన కవితాఖండికలతో
విలువల వలువలను చుట్టి
మానవీయతకు మరోరూపమయ్యిండు …

కాలం కన్నెర్రకు గురై
మట్టిపొరల కింద సజీవంగా పాతరేయబడ్డా ..
అవనికి ఆయువునందించే
కవితాంకురమై కసిగా మొలిచిండు ..

కనురెప్పలమాటున
కన్నీళ్ళను దాస్తూ ..
నవ్వుల పువ్వుల రారాజై
గాఢాంధకార
జవనాశ్వంపై ఊరేగి
నక్షత్ర సామ్రాజ్యాన నడుం వాల్చిండు ..

అతడు ..
లావాల విరజిమ్మే తన
అంతరంగ భావావేశాన్ని ..
క్లుప్తంగా గాఢంగా వ్యక్తీకరించి
తెలుగు సాహిత్యప్రస్థానానికి
దారిదీపమై నిల్చిండు ..
– బాదేపల్లి వెంకటయ్యగౌడ్
మహబూబ్ నగర్
9948508939