సైలెంట్‌ మోడ్‌

Silent mode– ఎన్నికల వేళ చడీచప్పుడు లేని బీజేపీ
– కరీంనగర్‌లో రెండు చోట్ల పోటీకి ఎంపీ సంజయ్ సిద్ధం..?
– ప్రచార రథాన్ని ప్రారంభించిన బండి
– ఒక్కొక్కరుగా కారెక్కుతున్న కమలదళం
– ఎక్కడా కనపడని ఉత్సాహం
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌ జిల్లాలో కమలం పార్టీ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, కాంగ్రెస్‌ ఆశావహులు ప్రచార ప్రయత్నాల్లో మునిగిపోగా కమలం పార్టీలో చడీచప్పుడు లేదు. జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో దరఖాస్తు చేసుకున్న ఆశావహులు సైతం జనంలో లేరు. కరీంనగర్‌ ఎంపీ సంజయ్ ఈసారి అసెంబ్లీకి రెండు చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కరీంనగర్‌లో మైనార్టీ ఓట్లు కీలకం కావడంతో గెలుపు కోసం ముథోల్‌ సెగ్మెంట్‌ను ఎంచుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి పార్టీ పరిస్థితులనుగానీ, శ్రేణుల కప్పదాట్లనుగానీ ఏమాత్రమూ పట్టించుకోకుండా రెండ్రోజుల కిందట సాదాసీదాగా ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో పార్టీలో భరోసా, నాయకత్వంపై నమ్మకం లేక కమలం శ్రేణులన్నీ అధికారపార్టీలోకి బాటపట్టాయి.
నాయకత్వలేమి..
కరీంనగర్‌ ఎంపీగా గెలుపు అనంతరం, రాష్ట్ర పార్టీ చీఫ్‌గా బాధ్యతల్లో ఉన్నప్పుడు ఏనాడూ పార్లమెంట్‌ సెగ్మెంట్‌పై ‘బండి’ దృష్టిసారించలేదు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 60 డివిజన్లలో 13 మంది కమలం గుర్తుపై గెలిచినా వారి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో కొన్నాళ్లకే ముగ్గురు కార్పొరేటర్లు ‘కారెక్కారు’. మిగిలిన సభ్యులతో అయినా కార్పొరేషన్‌లో ఫ్లోర్‌లీడర్‌ను ఎన్నుకోలేదు. పార్టీ నిర్మాణంలో భాగంగా కరీంనగర్‌ను నాలుగు జోన్‌లుగా విభజించి వేసిన కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల మార్పుచేర్పులు అంతర్గత కుమ్ములాటకు దారితీశాయి. పదవుల్లో భంగపాటుకు గురైన వారు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మరోవైపు తమ డివిజన్‌లో అభివృద్ధి లేక, ప్రజల్లో చరిష్మా కోల్పోలేక మరికొందరు కమలం కార్పొరేటర్లు కారెక్కేందుకు మంత్రి గంగులకు సంకేతాలు ఇచ్చారు. ఇంకోవైపు నగరం, రూరల్‌ ప్రాంతాల్లో బీజేపీ, దాని అనుబంధ సంఘాల యువతనూ గులాబీ పార్టీ ఆకర్షి స్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పార్టీని, శ్రేణుల కప్ప దాట్లను పట్టించుకోకుండా రెండ్రోజుల కిందట ఎంపీ బండి సంజరు సాదాసీదాగా ప్రచార రథాన్ని ప్రారంభించారు.
చొప్పదండిలో తగ్గిన మాజీ ఎమ్మెల్యే శోభ గ్రాఫ్‌
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా 2014లో గెలుపొందిన బొడిగే శోభ సొంత నేతలతో వివాదంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల ముందు ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారీ చొప్పదండి నుంచి బీజేపీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు కానీ, కనీసం నియోజకవర్గంలో తాను ఉన్నానన్న సంకేతాలు కూడా ఇవ్వడం లేదు. పైగా ఆమె పార్టీ మారుతారన్న ప్రచారమూ సాగుతోంది. దీంతో ఓ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో ఉన్నా.. అక్కడ పార్టీ ఎదగకపోగా ఉన్న గ్రాఫ్‌ కూడా పడిపోతోంది.