
నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లోని బోయి గల్లీలో ఓ వ్యక్తి తన పశువుల పాక తొలగించి నూతన ఇంటి నిర్మాణం కోసం పునాది పనులు చేపడుతుండగా ఔరంగజేబు కాలం నాటి నాణేలు బయటపడ్డాయి.దింతో స్థానికులు నాణేలు చూడటానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ముధోల్ కు చెందిన మారుతి తన పశువుల పాక తొలగించి నూతన ఇంటి నిర్మాణం కొరకు పునాది పనులు కూలీలతో చేపడుతున్నారు. పునాది తవ్వుతుండగా ఒక మట్టి కుండా గడ్డపారకు తగిలి, అందులోంచి నాణేలు బయట పడ్డాయి. దీంతో వెంటనే ఇంటి యజమాని మారుతి ఈ విషయం ముధోల్ ఎస్ఐ సంజీవ్ కు తెలిపారు. శనివారం ఎస్ ఐ సంజీవ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ నారాయణ పటేల్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి, బయటపడ్డ 92 వెండి నాణేలు స్వాధీన పరచుకున్నరు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచనామ నిర్వహించిన ఆనంతరం ఈ నాణేలను ముధోల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నట్లు తహశీల్దార్ వెల్లడించారు. ఈ నాణేలు ఔరంగజేబు కాలం నాటివని పలువురు పేర్కొన్నారు.