జ్యోతికి రజతం

– అబా కటువ జాతీయ రికార్డు
– ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ బ్యాంకాక్‌ (థారులాండ్‌)
తెలుగు తేజం, వర్థమాన స్ప్రింటర్‌ జ్యోతి ఎర్రాజి ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో మరో పతకం సాధించింది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో పసిడి పతకంతో ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పిన జ్యోతి ఎర్రాజి.. ఆదివారం జరిగిన మహిళల 200 మీటర్ల రేసులో రజతం సొంతం చేసుకుంది. 23.13 సెకండ్లలో 200 మీటర్ల పరుగు పూర్తి చేసిన జ్యోతి ఎర్రాజి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో రెండో పతకం దక్కించుకుంది. భారత స్టార్‌ మారథాన్‌ రన్నర్‌ పారుల్‌ చౌదరి సైతం రెండో పతకం గెల్చుకుంది. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణం నెగ్గిన పారుల్‌.. తాజాగా మహిళల 5000 మీటర్ల రేసులో రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. 15 నిమిషాల 52.35 సెకండ్లలో రేసు ముగించిన పారుల్‌ చౌదరి.. జపాన్‌ అథ్లెట్‌ యుమ యమమోట తర్వాతి స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్‌లో భారత అథ్లెట్‌ అంకిత 16.0.3.33 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది.
ఇక మహిళల షాట్‌పుట్‌లో అబా కటువ సంచలన ప్రదర్శన చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఆసియా చాంపియన్‌షిప్స్‌కు వచ్చిన అబా కటువ ఆదివారం జరిగిన పోటీల్లో ఏకంగా 93 సెమీ మెరుగుదల చూపించింది. నాలుగు కేజీల ఇనుప గుండును 18.06 మీటర్ల దూరం విసిరిన అబా కటువ.. సిల్వర్‌ మెడల్‌ సాధించింది. చైనా అథ్లెట్‌ సాంగ్‌ జియయూన్‌ 18.88 మీటర్లతో పసిడి పతకం సాధించింది. భారత వెటరన్‌ అథ్లెట్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌ 17 మీటర్ల త్రోతో కాంస్య పతకం అందుకుంది. మన్‌ప్రీత్‌ కౌర్‌ నెలకొల్పిన జాతీయ రికార్డును ఆసియా పోటీల్లో అబా కటువ సమం చేసింది. పురుషుల జావెలిన్‌ త్రోలో డిపి మను 81.01 మీటర్ల త్రో స్వర్ణం సాధించగా, మెన్స్‌ 5000 మీటర్ల రేసులో గుల్వీర్‌ సింగ్‌ 13 నిమిషాల 48.33 సెకండ్ల టైమింగ్‌తో కాంస్య పతకం దక్కించుకున్నాడు. మెన్స్‌ 800 మీటర్ల రేసులో కిషన్‌ కుమార్‌ 1.45.88 సెకండ్లతో, మహిళల 800 మీటర్ల రేసులో కెఎం చంద 2.01.58 సెకండ్లతో సిల్వర్‌ మెడల్స్‌ గెల్చుకున్నారు.