– పారిస్ 2024 పారాలింపిక్స్
పారిస్ (ఫ్రాన్స్) : పారాలింపిక్స్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌లో పతక వర్షానికి రంగం సిద్ధం చేసుకున్న భారత్.. నితీశ్ కుమార్ పసిడి పతకంతో లెక్క మొదలెట్టింది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 విభాగంలో నితీశ్ కుమార్ చాంపియన్‌గా నిలిచాడు. సోమవారం జరిగిన పసిడి పోరులో గ్రేట్ బ్రిటన్ షట్లర్ జెనీయాపై 2-1తో గెలుపొందాడు. 21-14, 18-21, 23-21తో ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో మెరుపు విజయం నమోదు చేశాడు. తొలి గేమ్ నెగ్గిన నితీశ్‌కు రెండో గేమ్‌లో గట్టి పోటీ ఎదురైంది. టైబ్రేకర్‌కు దారితీసిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో నితీశ్ పైచేయి సాధించాడు. 2009 రైలు ప్రమాదంలో కాలు కోల్పోయిన నితీశ్ కుమార్ ఐఐటీ మండి నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందాడు. జీవితం ముగిసిందనుకున్న తరుణంలో బ్యాడ్మింటన్‌పై ఏర్పడిన మక్కువ నేడు నితీశ్ కుమార్‌ను పారాలింపిక్స్ చాంపియన్‌గా నిలబెట్టింది. అథ్లెటిక్స్‌లో యోగేశ్ రజత పతకం సాధించాడు. డిస్కస్ త్రో ఎఫ్56 ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన యోగేశ్ మరోసారి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్‌లో సిల్వర్ నెగ్గిన యోగేశ్.. ప్రప్రంచ చాంపియన్‌షిప్స్‌లోనూ రెండు సార్లు సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 42.22 మీటర్ల దూరంతో యోగేశ్ పారిస్‌లో మళ్లీ సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు.