– షాట్‌పుట్‌లో ఖిలారికి రజతం
– పారిస్ 2024 పారాలింపిక్స్
నవతెలంగాణ-పారిస్
సచిన్ ఖిలారి.. 34 ఏండ్ల వయసులో పారాలింపిక్స్ అరంగేట్రంలోనే పతకం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌గా పారిస్ పారాలింపిక్స్ బరిలో నిలిచిన సచిన్ మెన్స్ షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో రజత పతకం సొంతం చేసుకున్నాడు. షాట్‌పుట్ ఫైనల్లో ఇనుప గుండును 16.32 మీటర్ల దూరం విసిరిన సచిన్ ఖిలారి పారాలింపిక్స్ సిల్వర్ మెడల్‌ను ముద్దాడాడు. ఈ పతకంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 21కు చేరింది. టోక్యో పారాలింపిక్స్‌లో అత్యధికంగా 19 పతకాలు సాధించిన భారత్.. పారిస్ 2024లో ఏడో రోజు పోటీల్లోనే ఆల్‌టైమ్ రికార్డును అధిగమించింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా భారత్ వరుస రోజుల్లో వరుసగా 8, 5 పతకాలతో అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.
పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 విభాగం పసిడి వేటలో డిఫెండింగ్ చాంపియన్, కెనడా పారా అథ్లెట్ గ్రెట్ స్టెవార్ట్, భారత పారా అథ్లెట్ సచిన్ ఖిలారి మధ్య ప్రధానంగా పోటీ కనిపించింది. ఈ ఇద్దరు సీజన్‌లో నిలకడగా 16 మీటర్ల సవాల్‌ను అధిగమించారు. ఫైనల్లోనూ ఆరు ప్రయత్నాల్లోనూ పలుమార్లు 16 మీటర్ల లైన్‌ను దాటారు. గ్రెగ్ స్టెవార్ట్ 16.38 మీటర్ల దూరంతో సచిన్‌ను వెనక్కి నెట్టాడు. 16.32 మీటర్ల దూరంతో సచిన్ ఖిలారి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. క్రోయేషియా పారా అథ్లెట్ లూకా బాకోవిచ్ 16.27 మీటర్లతో కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో పోటీపడిన మరో ఇద్దరు భారత పారా అథ్లెట్లు రోహిత్ కుమార్, మహ్మద్ యాసిర్‌లు మెడల్ పోడియంకు చేరువ కాలేకపోయారు. రోహిత్ కుమార్ 14.10 మీటర్ల త్రోతో తొమ్మిదో స్థానంలో నిలువగా.. మహ్మద్ యాసిర్ 14.21 మీటర్ల త్రోతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
ఫైనల్లో పోటీ తీవ్రంగా కనిపించింది. ప్రపంచ రికార్డు సాధించిన జోషువ (అమెరికా), ప్రపంచ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత కెర్విన్ (దక్షిణాఫ్రికా) సైతం బరిలో నిలిచారు. సచిన్, స్టెవార్ట్‌లకు నిలకడగా పోటీ ఇచ్చారు. రెండో ప్రయత్నంలోనే ఇనుప గుండును 16.32 మీటర్ల దూరం విసిరిన సచిన్.. పసిడి ఫేవరేట్‌గా నిలిచాడు. 2023, 2024 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి సాధించినన సచిన్ అదే ఉత్సాహంలో పారిస్‌లోనూ స్వర్ణంపై కన్నేశాడు. హౌంగ్జౌ ఆసియా పారా గేమ్స్‌లోనూ సచిన్ గోల్డ్ మెడల్ సాధించాడు. కానీ పారిస్‌లో సచిన్ స్వర్ణానికి స్టెవార్ట్ అడ్డుగా నిలిచాడు. మూడో ప్రయత్నంలోనే సచిన్‌ను దాటేసిన గ్రెగ్.. నాల్గో ప్రయత్నంలో మరింత మెరుగయ్యాడు. మహారాష్ట్రకు చెందిన సచిన్ 9 ఏండ్ల వయసులోనే సైకిల్ ప్రమాదంతో వైకల్యం బారిన పడ్డాడు. కాలేజ్ రోజుల్లో జావెలిన్ త్రోలో పోటీపడిన సచిన్ జాతీయ స్థాయిలో పతకాలు సైతం సాధించాడు. 2019లో భుజం గాయంతో జావెలియన్‌ను వదిలేశాడు. కోచ్ సత్య నారాయణ సూచనతో షాట్‌పుట్‌లో సాధన చేసిన సచిన్ తొలి ప్రయత్నంలోనే పారాలింపిక్స్ పతక విజేతగా నిలిచాడు.