అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
సంపత్ నంది మాట్లాడుతూ, ‘అందరికీ కనువిప్పు కలిగేలా, ఎంటర్టైన్ చేసేలా, మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది ఈ సినిమా. మా నిర్మాత రాజేందర్ రెడ్డి సమాజానికి మంచి చేయాలని, ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం చేశారు’ అని అన్నారు. ‘ఇది చాలా కొత్త కథ, కొత్త పాయింట్‌తో రాబోతోంది. సంపత్ నంది అద్భుతంగా కథ రాశారు. నేను దర్శకత్వం వహించాను. ఇంత మంచి ప్రాజెక్ట్‌ను రాజేందర్ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్’ అని దర్శకుడు మురళీ మనోహర్ చెప్పారు. నిర్మాత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ‘వనజీవి రామయ్య కోటికి పైగా మొక్కలు నాటారు. స్కూల్ పుస్తకాల్లో వీరి మీద పాఠాలున్నాయి. వీళ్లని చూసి ఇన్స్పైర్ అయి ఈ కథను రాసుకున్నాం. ప్రకతి లేకపోతే మనం ఉండలేం. ప్రకతికి కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టబోతోన్నాం. ఈనెల 22న చిరంజీవిపుట్టిన రోజున కొన్ని వేల మొక్కల్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా సినిమా నుంచే లాభాల్ని కూడా మొక్కల రూపంలోనే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు’ అని అన్నారు.