ఫైనల్‌కు పోలిని

Similar to the final– సెమీస్‌లో వేకిక్‌పై సంచలన విజయం
– వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లోకి 7వ సీడ్‌, ఇటలీకి చెందిన పోలిని ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో పోలిని మూడుసెట్ల హోరాహోరీ పోరులో అన్‌సీడెడ్‌ వేకిక్‌(క్రొయేషియా)పై సంచలన విజయం సాధించింది. తొలి సెట్‌ను చేజార్చుకొని మూడోసెట్‌ టైబ్రేక్‌లోనూ ఓ దశలో వెనుకబడ్డ పోలిని విజేతగా నిలవడం విశేషం. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో పోలిని 2-6, 6-4, 7-6(10-8)తో వేకిక్‌ను చిత్తుచేసింది. మ్యాచ్‌ ప్రారంభంలో తలబడ్డ పోలిని.. తేరుకొనేలోపే తొలిసెట్‌ను చేజార్చుకుంది. ఇక రెండోసెట్‌లో ఒక బ్రేక్‌ పాయింట్‌ సాధించి ఆ సెట్‌ను 6-4తో చేజిక్కించుకొంది. దీంతో ఇరువురు ఒక్కో సెట్‌ను గెలుచుకొని 1-1తో సమంగా నిలిచారు. మూడో సెట్‌లో ఇరువురు క్రీడాకారిణులు ప్రతి పాయింట్‌ను చేజిక్కించుకోవడంతో ఆ సెట్‌ టైబ్రేక్‌కు దారితీసింది. టై బ్రేక్‌లోనూ పోలిని ఓ దశలో 4-3తో వెనుకబడ్డా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ఆ సెట్‌ను చేజిక్కించుకొంది. దీంతో కెరీర్‌లో తొలిసారి ఓగ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లోకి పోలిని ప్రవేశించింది. క్రేజికోవా(చెక్‌) – రైబకినా(కజకిస్తాన్‌)ల మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో శనివారం జరిగే ఫైనల్లో పోలిని తలపడనుంది.
నేడు పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌..
పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ శుక్రవారం జరగనుంది. తొలి సెమీస్‌లో 5వ సీడ్‌ మెద్వదేబ్‌(రష్యా) 3వ సీడ్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌)తో తలపడనున్నాడు. మరో సెమీస్‌లో 25వ సీడ్‌ మసెట్టి(ఇటలీ) 2వ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. టాప్‌సీడ్‌ జెన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ) క్వార్టర్‌ఫైనల్లో మెద్వదెవ్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.