– వారం రోజుల్లో కీ విడుదల : సీఎమ్‌డీ ఎన్ బలరామ్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిలో 327 ఎక్స్‌టర్నల్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6, 7 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించినట్లు సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ తెలిపారు. 42 మేనేజ్‌మెంట్ ట్రెయినీ(ఈఅండ్‌ఎం) పోస్టులు, 7 మేనేజ్‌మెంట్ ట్రెయినీ (సిస్టమ్స్) పోస్టులు, వంద జేఎంఈటీ పోస్టులు, 9 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ(మెకానికల్), 24 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ(ఎలక్ట్రికల్), 47 ఫిట్టర్ ట్రెయినీ, 98 ఎలక్ట్రిషియన్ ట్రెయినీ పోస్టులకు పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 32 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 29,291 మంది (84 శాతం) హాజరయ్యారని తెలిపారు. వారం రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేస్తామనీ దానిపై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇస్తామన్నారు. ఆగస్టు నెలాఖరులోగా ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. గత నెల 20, 21వ తేదీల్లో 272 పోస్టులకు, తాజాగా 327 పోస్టులకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎవరి ప్రమేయం ఉండదనీ, ఎలాంటి రికమండేషన్‌లకు తావు లేదని తేల్చిచెప్పారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా మోసగాళ్లు మాయమాటలు చెప్తే నమ్మి మోసపోవొద్దనీ, అలాంటి వారి వివరాలను సింగరేణి విజిలెన్స్ విభాగానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.