సింగరేణి ప్రయివేటుపరం కానివ్వం

Singareni is privately owned– కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా..
– మహిళా కార్మికులకు ఉపరితలంపైనే పని
– ఇంటి స్థలం, వడ్డీ లేని రుణం ఇస్తాం
– రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ- మణుగూరు
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని, 200 గజాల ఇంటి స్థలం, రూ.20లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇల్లందు, టేకులపల్లి, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఏరియాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మణుగూరు పీకే ఓసీ వద్ద మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ.. సింగరేణి ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ నంబర్‌ గుర్తు గడియారంపై ఓటు వేసి ఐఎన్‌టీయూసీని గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. మళ్లీ కార్మికులను మోసం చేసేందుకు కొత్త హామీలు ఇస్తున్నారన్నారు. సింగరేణిలో పది సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించకుండా నిరంకుశంగా పాలించారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. టీబీజీకేఎస్‌ హామీలు నమ్మొద్దన్నారు.వడ్డించే వాడు మనవాడైతే అన్ని సౌకర్యాలు సమకూర్తాయన్నారు. కారుణ్య నియమాకాల్లో జరిగిన అవినీతిని బయటపెడతామన్నారు. ఐఎన్‌టీయూసీని గెలిపిస్తే.. ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు ఇస్తామన్నారు. సింగరేణి అన్ని ఏరియాలలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. ప్రయివేటు ప్రస్తావన లేకుండా ప్రభుత్వ రంగంలోనే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్త గనులను ప్రారంభిస్తామన్నారు. తిరిగి రెండు లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు. సింగరేణికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తామని, మహిళా కార్మికులు గని లోపల కాకుండా ఉపరితలంలో పని చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఇతర సంఘాలకు ఓటు వేస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు. అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరు బ్రహ్మయ్య, నాయకులు డాక్టర్‌ శంకర్‌ నాయక్‌, ఏరియా ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్‌ పాల్గొన్నారు.