సింఘూలో మళ్లీ లొల్లి…! ఈసారి మంచులోంచి మంటల్లేచాయి. గతంలో రైతులు, ఇప్పుడు తమ పర్యావరణాన్ని, తద్వారా కాప్-28లో మన దేశం ఇచ్చిన హామీలు నెరవేరి, దేశం పరువు పోకూడదంటూ ప్రధాన పర్యావరణవేత్త వాంగ్ చుక్ బృందాన్ని సింఘూలో నిలిపేశారు. ఒకసారి రాజ్యాన్ని సవాలుచేసిన తర్వాత వారు కార్మికులైతేనేం? రైతులైతేనేం? పర్యావరణ ప్రేమికులైతేనేం? బుల్‌డోజర్ న్యాయం ముందు అందరూ సమానులే! ఈ ‘న్యాయదేవత’ కళ్లూ, చెవులకు గంతలుండవు. అన్నీ తెరుచుకునే న్యాయం చేస్తూంటుంది.
వారు లడఖ్ పర్యావరణం కోసం చేసినా, శాంతియుతంగా ‘మార్చ్’ చేసినా, లడఖ్ రాజధాని ‘లే’ నుండి వెయ్యి కి.మీ.లు నడిచొచ్చినా, లడఖ్ మంచు కొండల్లో నుండి నిప్పులు కక్కే థార్ ఎడారి దాటొచ్చినా పాపం! ఆ లడఖీయులకు భారతదేశం మహాత్ముని ఆందోళనా పద్ధతులకు ఎప్పుడో స్వస్తి పలికేసిందని తెలియదు కాబోలు. అక్కడ కరవాలాల్లేవు. యోగి రాజ్యంలో తిప్పినట్లు తవంచాలు పట్టుకుని ఊరేగేవారు లేరు. ప్రధాన పర్యావరణవేత్త రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ దగ్గర నుండి వారి పాదయాత్రలోని వారంతా నిరాయుధులు.
వారి డిమాండే అణుబాంబు. రాజ్యానికి అదే ప్రధాన సవాలు. లడఖ్‌కు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలు వర్తింపజేయాలని, తమకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనేది వారి డిమాండు. తమ భూములను, ఆ భూగర్భంలోని అపురూప ధాతువులైన ఆర్సెనిక్, బొరాక్స్ వంటి వాటిని, బంగారం, గంథకం, క్వార్డ్‌జ్ వంటి ఖనిజాలను వారి పాలనలోనైతే అవసరమైన మేరకే తవ్వుతామని, ”అ-ఆ”లు రంగంలోకి దిగితే తమ ప్రాంత పర్యావరణమే సర్వనాశనం అవుతుందన్న అభిప్రాయంలో వారున్నారు.
లడఖ్ విద్యా వ్యవస్థలో అనేక నూతన సంప్రదాయాలకు ప్రారంభకుడిగా పేరున్న సోనమ్ వాంగ్‌చుక్ ”స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (ఎస్‌ఈసీఎంఓఎల్) స్థాపకుడు. కృత్రిమ ‘గ్లేసియర్స్’ ద్వారా ఆయన సృష్టించిన ‘మంచు స్తూపాలు’ పంటలకనువైన కాలంలో నీరు అందించే సాంకేతిక పరిజ్ఞానం రూపొందించాయి. 58 ఏండ్ల ఈ వాంగ్‌చుక్ స్వయంగా ఇంజినీర్. ఆయన మాటకు ప్రజల్లో విలువుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతు లభిస్తోంది. దాన్ని ఉపయోగించుకునే 2019లో 370 ఆర్టికల్ రద్దుకు ఆయన మద్దతు నాడు బీజేపీ కూడగట్టింది. ”తాము ప్రస్తుతం పెనంమీద నుండి పొయ్యిలో పడ్డామ”ని ఇటీవల ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు. ”అనుభవంలోకొస్తేనే తత్వం బోధపడ్తుంద”ని గిరీశం చెప్పింది ఎంత కరెక్టో నేడు వాంగ్‌చుక్‌కి మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. ”మహాత్ముడు పుట్టిన దేశంలో ఆయన్ను అనుసరించడం ఇంత కష్టమెందుకవుతుందో అర్థంకాదు. ఏదో ఒక దారి అయితే కచ్చితంగా ఉంటుంది” అని వాంగ్‌చుక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పిన మాటలు గమనార్హం. వీరి ధర్నా శిబిరంలో కలిసిన ఒక ఆంగ్ల మ్యాగజైన్ విలేకరి ”ఆరవ షెడ్యూల్లో చేరిస్తే మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోలేరట కదా” అనే మాట పూర్తికాకముందే నాడు బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తే మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోలేరన్నట్టు ఉంది మీ ప్రశ్న అంటూ మొహం వాచేలా సమాధానం చెప్పాడు వాంగ్‌చుక్.
ఇది రైతుల పోరాటమంత విస్తృతమైంది కాకపోవచ్చు. ప్రధానో, గృహమంత్రో, రాష్ట్రపతో తమతో చర్చించాలనే డిమాండు చిన్నదే కావచ్చు. రేపు వారోమెట్టుదిగి చర్చలు జరపనూవచ్చు. ఈ ఉద్యమం చల్లారిపోనూవచ్చు. లేదా వాంగ్‌చుక్ చెప్పినట్టు స్విడ్జర్లాండ్ నుండి లడఖ్‌కు చెందిన 90 ఏండ్ల పండు ముసలి వచ్చి పాల్గొనవచ్చు. ఢిల్లీలో చదువుకునే లడఖ్ విద్యార్థులు వచ్చి కలిసి ఈ పోరాటం నూతన జవసత్వాలు పుంజుకోనూవచ్చు.
ఏ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఇంతకాలంగా ఎర్రజెండాలు పోరాడుతున్నాయో ఆ పెట్టుబడిదారీ విధానమే పర్యావరణ విధ్వంసం చేస్తోందన్న నూతన చైతన్యం కార్మికవర్గంలో మొగ్గతొడిగింది. ”గ్రీన్స్” పార్టీలు అనేక ఐరోపా దేశాల్లో అధికార కూటముల్లో ఉన్నాయి. క్లైమేట్ ఛేంజ్ సదస్సులు, ‘కాప్’ సదస్సులు జరిగిపోతూనే ఉన్నాయి. కానీ పెట్టుబడిదారుల విశృంఖల దోపిడీ ఆగట్లేదు. అందుకే లడఖ్‌లో ప్రారంభమైన పోరాటం విజయం సాధించాలని, సాధిస్తుందని ఆశిద్దాం.