– ఆసియా, ప్రపంచ చాంపియన్‌షిప్స్ సెలక్షన్స్
– ఆరుగురు రెజ్లర్లపై అడ్‌హాక్ కమిటీ నిర్ణయం!
న్యూఢిల్లీ : ఓ వైపు రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్, మరోవైపు ఆసియా క్రీడలకు కౌంట్‌డౌన్ మొదలు కాగా.. పతక వేటలో భారత ఫేవరేట్ మల్లయోధులు సుమారు ఆరు నెలలుగా ఆందోళన బాటలోనే ఉన్నారు!. బిజెపి ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భారత రెజ్లింగ్ క్రీడాకారులు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్ ఆగడాలపై ఈ ఏడాది జనవరిలో గళమెత్తిన రెజ్లర్లు.. ఇప్పటికీ పోరాడుతున్నా బిజెపి ఎంపీని అరెస్టు చేసేందుకు అవకాశం లేకుండా తాజాగా ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టాన్ని ఉపసంహరిస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు భారత జట్లను ఎంపిక చేసేందుకు గడువు ముగియనుండగా.. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అడ్‌హాక్ కమిటీ ఆందోళనలో పాల్గొన్న ఆరుగురు రెజ్లర్లకు ట్రయల్స్‌లో పోటీపడటంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆసియా క్రీడలకు భారత అథ్లెట్ల బృందం వివరాలను జులై 15లోగా ఆసియా ఒలింపిక్ కౌన్సిల్‌కు అందజేయాల్సి ఉంది. రెజ్లింగ్ జట్టు విషయంలో గడువు ఆగస్టు 15 వరకు పొడగించాలని తాజాగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది. దీనిపై ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ స్పందించాల్సి ఉంది. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వారం వ్యవధిలో జరుగనున్నాయి. బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు ఆసియా, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాండ్లూ ఆందోళనలో ఉండటంతో స్టార్ రెజ్లర్లకు అసలు ప్రాక్టీసే లేదు. దీంతో ట్రయల్స్‌లో పోటీపడేందుకు ఆరుగురు రెజ్లర్లు అడ్‌హాక్ కమిటీని ఆగస్టు వరకు గడువు కోరారు. ఆగస్టు వరకు గడువు పొడగింపు వీలుకాని తరుణంలో.. ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన రెజ్లర్‌తో సింగిల్ బౌట్ ట్రయల్ నిర్వహిస్తామని అడ్‌హాక్ కమిటీ తెలిపింది. బజరంగ్, రవి దహియ, వినేశ్, సాక్షి మాలిక్‌లు గతంలో బిజీ షెడ్యూల్‌తో ట్రయల్స్‌లో మినహాయింపులు పొందారు. కానీ సంగీత ఫోగట్ సహా ఇతర రెజ్లర్లకు ఎన్నడూ ట్రయల్స్‌లో మినహాయింపులు దక్కలేదు. ఈ విషయంలో అడ్‌హాక్ కమిటీ త్వరలోనే అధికార నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.