సినర్‌ విన్నర్‌

Sinner Winner– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2025
– ఫైనల్లో జ్వెరెవ్‌పై మెరుపు విజయం
– మెన్స్‌ సింగిల్స్‌ టైటిల్‌ సినర్‌ వశం
23 ఏండ్ల ఇటలీ స్టార్‌ జానిక్‌ సినర్‌ అదరగొట్టాడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలుపుకున్నాడు. వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా అవతరించాడు. రెండో సీడ్‌ జర్మనీ కుర్రాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై వరుస సెట్లలో సూపర్‌ విక్టరీ నమోదు చేసిన జానిక్‌ సినర్‌ కెరీర్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు.
నవతెలంగాణ-మెల్‌బోర్న్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరు. రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటగాడు నొవాక్‌ జకోవిచ్‌ బరిలో లేడు, కార్లోస్‌ అల్కరాజ్‌ సైతం పోటీ నుంచి నిష్క్రమించాడు. ప్రపంచ నం.1 జానిక్‌ సినర్‌, వరల్డ్‌ నం.2 అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌లు ఆఖరు సమరంలో తలపడ్డారు. జకోవిచ్‌ వంటి మేటి ఆటగాడు బరిలో నిలిస్తే.. ఏకపక్ష ఫలితం ఊహించవచ్చు. కానీ జానిక్‌ సినర్‌ సైతం తను అదే కోవలోని ఆటగాడినని నిరూపించుకున్నాడు!. జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై 6-3, 7-6(7-4), 6-3తో వరుస సెట్లలోనే ఘన విజయం సాధించాడు. 23 ఏండ్ల జానిక్‌ సినర్‌ 2024లో యుఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించాడు. 2025 సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ విజయాలను మూడుకు మెరుగుపర్చుకున్నాడు. ఇక మహిళల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ టేలర్‌, సైనికోవ జోడీ 6-2, 6-7(4-7), 6-3తో మూడో సీడ్‌ సు వీ, జెలెనె ఒస్టాపెంకోలపై గెలుపొంది టైటిల్‌ సాధించారు.
సూపర్‌ సినర్‌
పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జానిక్‌ సినర్‌ ఏకపక్ష విజయం సాధించాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ నుంచి ఆశించిన ప్రతిఘటన ఎదురు కాలేదు. మూడు సెట్ల మ్యాచ్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ కనీసం ఒక్క బ్రేక్‌ పాయింట్‌ సాధించలేకపోయాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 12 ఏస్‌లు సంధించినా.. సినర్‌ ఆరు ఏస్‌లే కొట్టాడు. ఇద్దరూ చెరో రెండు డబుల్‌ ఫాల్ట్స్‌ చేశారు. కానీ ఒత్తిడితో కూడిన ఉత్కంఠభరిత ఫైనల్లో జానిక్‌ సినర్‌ రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రత్యర్థి సర్వ్‌ను బ్రేక్‌ చేసే అవకాశాన్ని సైతం సృష్టించుకోలేదు. పాయింట్ల పరంగా సినర్‌ 107-83తో జ్వెరెవ్‌పై పైచేయి సాధించాడు. గేముల పరంగా 19-12తో సినర్‌ ఆధిపత్యం చూపించాడు. స్వీయ సర్వ్‌లో సినర్‌ 16 గేములు గెల్చుకోగా.. సినర్‌ 12 గేములు గెల్చుకున్నాడు. సినర్‌ ఓ టైబ్రేకర్‌లో పైచేయి సాధించి.. మ్యాచ్‌ను మూడు సెట్లలోనే ముగించాడు.
ఫైనల్లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ రెండో సెట్లో మెప్పించాడు. 5-4తో సినర్‌ను వెనక్కి నెట్టాడు. ఆరో గేమ్‌ గెల్చుకునే అవకాశం ఉన్నప్పటికీ జ్వెరెవ్‌ తడబాటుకు గురయ్యాడు. 5-5తో స్కోరు సమం చేసిన సినర్‌.. సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు. టైబ్రేకర్‌లో సినర్‌ 7-4తో పైచేయి సాధించాడు. తొలి, మూడో సెట్లను సినర్‌ అలవోకగా నెగ్గాడు. జ్వెరెవ్‌ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. 2019లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రపంచ నం.1, నం.2 ఆటగాళ్లు నొవాక్‌ జకోవిచ్‌, రఫెల్‌ నాదల్‌ తలపడగా.. ఆ తర్వాత 2025లో మళ్లీ ఆ సమీకరణం పునరావృతమైంది. 2019లో సైతం నం.2 నాదల్‌ను నం.1 జకోవిచ్‌ వరుస సెట్లలో ఓడించటం విశేషం. 1992-93 తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అత్యంత పిన్న వయసులో వరుసగా రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనతను సైతం జానిక్‌ సినర్‌ దక్కించుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐదు మేజర్‌ టోర్నమెంట్లలో జానిక్‌ సినర్‌ ఏకంగా మూడింట చాంపియన్‌గా అవతరించాడు.
టెన్నిస్‌ ఓపెన్‌ శకంలో జానిక్‌ సినర్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ భిన్నమైన రికార్డులు సాధించారు. 1968 తర్వాత ప్రొఫెషనల్‌ కెరీర్‌లో తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో విజయాలు సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఇటాలియన్‌ జానిక్‌ సినర్‌ నిలిచాడు. ఇదే సమయంలో కెరీర్‌ తొలి మూడు గ్రాండ్‌స్లామ్స్‌ టైటిల్‌ పోరులో పరాజయాలు చవిచూసిన ఏడో ఆటగాడిగా అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ నిలిచాడు. 2020 యుఎస్‌ ఓపెన్‌, 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఐదు సెట్ల మహా సమరంలో పరాజయం పాలైన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌.. ఆదివారం మెల్‌బోర్న్‌లో అంతటి పోరాట పటిమ చూపించలేదు. సినర్‌కు కేవలం మూడు సెట్లలోనే టైటిల్‌ను కోల్పోయాడు.