ఆర్ధిక జనజీవన క్రమంలో పెరిగిన తపాలా శాఖ ప్రాముఖ్యత : ఎస్ఐ పీ. రమేష్ నాయక్

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆధునిక ఆర్ధిక జీవన క్రమంలో గ్రామీణ తపాలా శాఖ ప్రాముఖ్యత పెరిగిందని పాల్వంచ ఎస్ ఐ పీ రమేష్  నాయక్ అన్నారు. అశ్వారావుపేట ఉప తపాలా కార్యాలయంలో ఎస్ పి ఎం శ్యాం మహేంద్ర అధ్యక్షతన 17 బ్రాంచి తపాలా కార్యాలయాల జీ డీ ఎస్ లతో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రమేష్ నాయక్ మాట్లాడుతూ.. ఆధునిక ఆర్ధిక జనజీవన క్రమంలో తపాలా కార్యాలయాల ప్రాధాన్యత పెరిగిందన్నారు. తపాలా శాఖ అందిస్తోన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత గ్రామీణ డాక్ సేవక్ లు, తపాలా సిబ్బందిదే అని చెప్పారు. గతంలో తపాల కార్యాలయం అంటే నాలుగు ఉత్తరాలు, రెండు ఆర్డీ, ఎస్బీ ఖాతాలు ఉంటే చాలు అనే విధంగా ఉండేది అని, నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అన్ని పథకాల్లోనూ తపాలా శాఖకు ప్రాముఖ్యత పెరిగిందని పేర్కొన్నారు. ఆర్డీ, ఎస్బీ,టీడీ, సుకన్యసమృద్ధి యోజన, మహిళా సమృద్ధి యోజన, తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా భీమా, ఐపీపీబీ లాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో పీఏ ఉదయ్ సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.