సీఎం సారూ.. మా గోస వినండి

Sir CM.. Listen to our voice– మహిళా ఉద్యోగులకు అండగా నిలవండి : రాష్ట్ర స్పౌజ్‌ ఫోరం బాధ్యుల విజ్ఞప్తి
– ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతున్న మహిళా ఉపాధ్యాయులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌ రెడ్డిని రాష్ట్ర స్పౌజ్‌ఫోరం బాధ్యులు కందగట్ల సురేష్‌, అనిత, గౌసియా, సంధ్య కోరారు. మంగళవారం హనుమకొండ నుంచి పలువురు స్పౌజ్‌ బాధితులు హైదరాబాద్‌ నగరానికి తరలివచ్చారు. మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో ప్రజావాణిలో అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలతో స్పౌజ్‌ ఉపాధ్యాయులు రెండేండ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్పౌజ్‌ బదిలీల పరంగా జారీ చేసిన ఉత్తర్వులను 33 జిల్లాల్లో అమలు చేయాల్సి ఉండగా.. 13 జిల్లాలను వదిలివేసి ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపి.. పలుమార్లు విన్నపాలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలామంది మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్పౌజ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో స్పౌజ్‌తోపాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులతో వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి స్పౌజ్‌ బాధితులకు బదిలీల ఉత్తర్వులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్‌ఫోరం అధ్యక్షులు వివేక్‌, కోఆర్డినేటర్లు నరేష్‌, కృష్ణ, నాయకులు అర్చన, సువర్ణలక్ష్మి, లలితాంబ, రవీందర్‌రెడ్డి, బాధితులు వేణు, నర్సయ్య, శ్రీనివాస్‌, సదానందం, రవీందర్‌రావు, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.