సారూ…జర ఇటు చూడు

Sir...just look here– పాడైన సగం కోల్డ్‌ స్టోరేజీ బాక్సులు
– గాంధీ మార్చురీలో భరించరాని వాసన
రాష్ట్రంలో ఒకవైపు రాజకీయ వేడి పెరిగిపోయింది. పార్టీలు, రాజకీయ నాయకులు పోటాపోటీగా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు సమస్యలు పేరుకుపోతున్నా …పట్టించుకునే నాథుడు లేడని బాధితులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలోని పెద్ద ప్రభుత్వాస్పత్రుల్లో ఒకటైన హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో గత నెల రోజులకు పైగా మార్చురీలో నెలకొన్న ఇబ్బంది పరిష్కరానికి నోచుకోవడం లేదు. మార్చురీలో పోస్ట్‌ మార్టం చేసేందుకు శవాలను భద్రపరిచేందుకు 60 కోల్డ్‌ స్టోరేజ్‌ బాక్సులుండగా, అందులో దాదాపు సగం బాక్సులు పాడైపోయాయి. నెల రోజుల క్రితమే ఈ విషయం ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ దృష్టికి అక్కడ పని చేసే వైద్యులు, సిబ్బంది తీసుకెళ్లినప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. పాడైపో యిన బాక్సుల్లో ఉంచిన శవాల నుంచి వస్తున్న దుర్వా సన భరించలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గాంధీ మార్చురీకి వచ్చే శవాల్లో గుర్తించిన శవాలతో పాటు గుర్తించని శవాలు (అన్‌నోన్‌ బాడీస్‌) ఉంటాయి. ఆస్పత్రిలో మరణించిన వారితో పాటు ఆస్పత్రి పరిధిలోకి వచ్చే పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగే ప్రమాదాల్లో మరణాలు, వారిని తరలించిన తర్వాత జరిగే మరణాలతో పాటు మెడికో లీగల్‌ కేసులకు సంబంధించిన శవాలు కూడా మార్చురీకి తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో గుర్తించిన వాటిని కాకుండా గుర్తింపుకు నోచుకోని శవాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కి చెందిన సిబ్బంది దాదాపు ప్రతి 10 రోజులకు ఒకసారి తీసుకెళ్లి సామూహిక అంత్యక్రియలు చేస్తుంటారు. దీంతో ప్రతిసారి 50 నుంచి వంద శవాలను తరలించాల్సి వస్తున్నట్టు తెలుస్తున్నది. అప్పటి వరకు ఇలాంటి భౌతికదేహాలను ఎక్కువగా పెర్‌ఫ్యూమ్‌ గదిలో ఉంచుతుంటారు. ప్రతి రోజు సుమారు 15 నుంచి 20 మందికి పోస్ట్‌ మార్టం చేస్తుండగా, ఈ విభాగంలో 25 నుంచి 30 మంది వరకు డాక్టర్లు (ప్రొఫెసర్లు, పీజీలు కలిసి) పని చేస్తున్నారు. వీరితో పాటు నాలుగో తరగతి సిబ్బంది సహాయకా రులుగా ఉన్నారు. గాంధీ ఆస్పత్రి పరిధి కూడా విస్తతంగా ఉండటంతో ప్రతి రోజు శవాల రాకతో ఉన్న 60 బాక్సుల ఆక్యుపెన్సీ ఎప్పుడు వందశాతంగా ఉంటున్నది. అయితే ప్రతి రోజు 15 నుంచి 20 శవాలకు పోస్ట్‌మార్టం చేస్తుండటంతో 60 బాక్సులు సరిపోతున్నాయి. వీటిలో కొన్ని సరిగా పని చేయకపోవడంతోనే సమస్య తలెత్తున్నది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆ విభాగం వైద్యులు ఇప్పటికే సంప్రదించగా బాక్సుల మరమ్మతుల కోసం ఆదేశించినట్టు తెలుపగా, మరోవైపు మరమ్మతులు చేయాల్సిన కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో మరమ్మతులకు ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో ప్రతి రోజు ఆ విభాగంలో వస్తున్న దుర్వాసన భరించలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని సిబ్బంది కోరుకుంటున్నారు.