సారూ..మాకేం చేశారు?

Sir, what did you do to us?– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
– జీతాలు ఆలస్యం,3 డీఏలు పెండింగ్‌

– సీపీఎస్‌ రద్దుపై దాటవేత
– కంటితుడుపుగా 5 శాతం ఐఆర్‌
– బదిలీలు, ఉద్యోగోన్నతుల్లేక ఉపాధ్యాయుల్లో అసంతృప్తి
– రెండో పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై మాత్రమే సానుకూలత
– ఎన్నికల్లో ఏం చేస్తారో?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్‌, మంత్రులు పలు సందర్భాల్లో చెప్తుంటారు. కానీ ఉద్యోగుల్లో మాత్రం ఆ భావన కనిపించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకటో తేదీన జీతాలు వచ్చే పరిస్థితి ఉండేదనీ, ప్రత్యేక రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీన జీతాలొస్తున్నాయి. ఇంకోవైపు ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంలో మూడు కరువు భత్యం (డీఏ)లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులకు గతేడాది జులై నుంచి 3.64 శాతం, ఈ ఏడాది జనవరి నుంచి 3.64 శాతం, జులై నుంచి 3.64 శాతం కలిపి మొత్తం 10.92 శాతం డీఏను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉన్నది. కానీ సర్కారు వాటిని ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉంచింది. ఆ డీఏలు మంజూరు చేశాక, పీఆర్సీ కమిటీ ఏర్పాటు, మధ్యంతర భృతి (ఐఆర్‌)పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులంతా ఆశించారు. కానీ ప్రభుత్వం ఉద్యోగులంద రికీ షాక్‌ ఇచ్చింది. డీఏల ప్రస్తావన లేకుండానే రెండో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు ఐదు శాతం ఐఆర్‌ను ప్రకటించింది. పీఆర్సీ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తూనే ఐదు శాతం ఐఆర్‌ పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఐఆర్‌ సవరణకు అవకాశం లేదు. దీంతో ఉద్యోగులకు ఐదు శాతం ఐఆర్‌ అమలయ్యే అవకాశమున్నది. అక్టోబర్‌ జీతంతో ఐఆర్‌ను కలిపి నవంబర్‌లో ప్రభుత్వం చెల్లించనుంది. అయితే తొమ్మిదో పీఆర్సీలో 22 శాతం ఐఆర్‌, 39 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు.
పదో పీఆర్సీలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 27 శాతం ఐఆర్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. తెలం గాణ మొదటి పీఆర్సీలో ఐఆర్‌ లేకుండానే 30 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలు కీలకం కావడంతో అధికార పార్టీపై ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని కొంతమేర తగ్గించుకునేందుకు ఐదు శాతం ఐఆర్‌ను ప్రకటించడం గమనార్హం. ఇంకోవైపు ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత నాణ్యమైన వైద్య చికిత్సనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడం, మూడు డీఏలు పెండింగ్‌లో ఉంచడం, ఐదు శాతమే ఐఆర్‌ను ప్రకటించడం వంటి కారణాలతో బీఆర్‌ఎస్‌ సర్కారు తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ప్రభావం చూపే అవకాశమున్నది.
సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు అంశం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారనుంది. రాష్ట్రంలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. వారిలో 18,832 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 1.72 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. వారికి సామాజిక భద్రత లేదు. వారంతా సీపీఎస్‌ రద్దు కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, ఢిల్లీ, పంజాబ్‌ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరణ చేశాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే సీపీఎస్‌ను రద్దు చేయడం గమనార్హం. తాజాగా కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో సీపీఎస్‌ రద్దు అంశం కీలకంగా మారనుంది. అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ చేర్చనుంది. ఇది కాంగ్రెస్‌ పార్టీకి సానుకూల అంశంగా ఉండనుంది. అయితే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం సీపీఎస్‌ రద్దుపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
ఇటీవల అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ‘పాత పెన్షన్‌ పునరుద్ధరణ పట్ల సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’అని సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు.
అయితే ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందో వేచిచూడాలి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేయడం లేదు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) బిల్లును రద్దు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.
ఉపాధ్యాయుల్లోనూ అసంతృప్తి ఎక్కువే…
రాష్ట్రంలో ఉపాధ్యాయుల్లోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి ఎక్కువగానే ఉన్నది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ అసంపూర్తిగా ముగిసింది. అవి పూర్తవు తాయో, లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు317 జీవో సమస్య తీవ్రంగా ఉన్నది. స్థానికులుగా ఉన్న ఉపాధ్యాయులను ఇతర జిల్లాలకు స్థానికేతరులుగా ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో స్థానికత సమస్యతో బాధితులుగా ఉన్న వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో స్పౌజ్‌ బదిలీలు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో మిగిలిపోయిన ఉపాధ్యాయులు మానసిక ఆవేదనకు గురవుతున్నారు. గతేడాది జనవరిలో ప్రభుత్వం కేవలం 615 స్కూల్‌ అసిస్టెంట్‌ స్పౌజ్‌ బదిలీలను మాత్రమే చేపట్టింది. ఇంకా 1,500 మంది ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల స్పౌజ్‌ బదిలీలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
దీంతో వారు కుటుంబాలకు దూరంగా ఉంటూ, రోజూ ప్రయాణం చేయలేక సతమతమవుతున్నారు. ఇలా అనేక కారణాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఏ రాజకీయ పార్టీని ఆదరిస్తారన్నది వేచిచూడాల్సిందే.