సిరాజ్ సూప‌ర్‌

– 4 వికెట్లతో చెలరేగిన సిరాజ్‌
– డుప్లెసిస్‌, కోహ్లి అర్థ సెంచరీలు
– పంజాబ్‌పై బెంగళూర్‌ విజయం
మహ్మద్‌ సిరాజ్‌ (4/21) నిప్పులు చెరగటంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ముచ్చటగా మూడో విజయం నమోదు చేసింది. ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ ఎదురుదాడి మంత్ర రివర్స్‌ పంచ్‌ ఇవ్వగా.. ఆ జట్టు 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (84), విరాట్‌ కోహ్లి (59) అర్థ సెంచరీల మోత మోగించటంతో తొలుత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 174 పరుగులు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌కు సీజన్లో ఇది మూడో పరాజయం.
నవతెలంగాణ-మొహాలి

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మురిసింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో విజయం అనంతరం గాడి తప్పిన బెంగళూర్‌.. పంజాబ్‌ కింగ్స్‌పై సాధికారిక విజయం నమోదు చేసింది. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (4/21), స్పిన్నర్‌ వానిందు హసరంగ (2/39) మాయతో బెంగళూర్‌ 24 పరుగుల తేడాతో గెలుపొందింది. ఛేదనలో ఓపెనర్‌, ఇంపాక్ట్‌ ఆటగాడు ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (46, 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ (41, 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ దూకుడుతో చెలరేగినా.. వరుస వికెట్ల పతనం పంజాబ్‌ కింగ్స్‌ ఓటమిని శాసించింది. 18.2 ఓవర్లలో 150 పరుగులకే పంజాబ్‌ కింగ్స్‌ కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్‌ (84, 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (59, 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలు నమోదు చేశారు. బెంగళూర్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌16లో బెంగళూర్‌కు ఆరు మ్యాచుల్లో ఇది మూడో విజయం కాగా.. పంజాబ్‌కు సైతం ఆరు మ్యాచుల్లో ఇది మూడో ఓటమి.
వికటించిన ఎదురుదాడి!
175 పరుగుల ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ దూకుడుగా ఆడింది. పవర్‌ప్లేలో 49/4తో నిలిచినా.. జట్టు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అథర్వ (4), లివింగ్‌స్టోన్‌ (2)లను సిరాజ్‌ అవుట్‌ చేయగా.. మాథ్యూ షార్ట్‌ (8)ను హసరంగ సాగనంపాడు. హర్‌ప్రీత్‌ భాటియాను రనౌట్‌ రూపంలో సిరాజ్‌ వెనక్కి పంపించాడు. ఆల్‌రౌండర్‌ శామ్‌ కరణ్‌ను హసరంగ రనౌట్‌ చేశాడు. ఓపెనర్‌ ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (46) ఓ ఎండ్‌లో నిలబడగా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ (41) అండగా నిలిచాడు. టాప్‌లో ప్రభుసిమ్రన్‌, చివర్లో జితేశ్‌ కదం తొక్కగా.. పంజాబ్‌ కింగ్స్‌ రన్‌రేట్‌ దూసుకెళ్లింది. రన్‌రేట్‌ నిలకడగా ఉంచుకున్న పంజాబ్‌.. వికెట్లను కాపాడుకోలేదు. చివర్లోనూ చెలరేగిన సిరాజ్‌ హర్‌ప్రీత్‌ బరార్‌ (13), నాథన్‌ ఎలిస్‌ (1)లను అవుట్‌ చేశాడు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌ 150 పరుగులకే కుప్పకూలింది. పరుగుల పరంగా పంజాబ్‌ కింగ్స్‌కు ఇది భారీ ఓటమి. కానీ నిజానికి ఆ జట్టు ఓడినా.. ఎదురుదాడికే కట్టుబడింది. వికెట్లు నిలుపుకుంటే పంజాబ్‌ కింగ్స్‌ పైచేయి సాధించేందుకు అవకాశం ఉండేది.
ఓపెనర్ల అర్థ సెంచరీలు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఓపెనర్లు శతక భాగస్వామ్యం అందించారు. విరాట్‌ కోహ్లి (59), డుప్లెసిస్‌ (84) తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో 59 పరుగులు పిండుకున్న కోహ్లి, డుప్లెసిస్‌ బెంగళూర్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 31 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన డుప్లెసిస్‌.. ఆ తర్వాత జోరు కొనసాగించాడు. ఐదు ఫోర్ల సాయంతో విరాట్‌ కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఓ సిక్సర్‌తో జోరందుకున్న కోహ్లి.. వికెట్‌ చేజార్చుకున్నాడు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (0), దినేశ్‌ కార్తీక్‌ (7), మహిపాల్‌ (7 నాటౌట్‌), షాజాబ్‌ అహ్మద్‌ (5 నాటౌట్‌) ధనాధన్‌ దూకుడు చూపించలేదు. ఓపెనర్ల అర్థ సెంచరీలతో బెంగళూర్‌ 174 పరుగులు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బరార్‌ (2/31) రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్‌ సింగ్‌, నాథన్‌ ఎలిస్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. ఇటు పంజాబ్‌ కింగ్స్‌, అటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ సారథులు మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు!. బెంగళూర్‌ కెప్టెన్‌ డుప్లె సిస్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌ చేయగా.. విరాట్‌ కోహ్లి సారథ్యం చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌ శిఖర్‌ ధావన్‌ పూర్తిగా బెంచ్‌కు పరిమితం కాగా.. శామ్‌ కరణ్‌ సారథ్యం వహించాడు.
స్కోరు వివరాలు : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : విరాట్‌ కోహ్లి (సి) జితేశ్‌ (బి) 59, డుప్లెసిస్‌ (సి) శామ్‌ కరణ్‌ (బి) ఎలిస్‌ 84, మాక్స్‌వెల్‌ (సి) అథర్వ (బి) బరార్‌ 0, దినేశ్‌ కార్తీక్‌ (సి) అథర్వ (బి) అర్షదీప్‌ 7, మహిపాల్‌ నాటౌట్‌ 7, షాబాజ్‌ నాటౌట్‌ 5, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174.
వికెట్ల పతనం : 1-137, 2-137, 3-151, 4-163.
బౌలింగ్‌ : అర్షదీప్‌ సింగ్‌ 4-0-34-1, హర్‌ప్రీత్‌ బరార్‌ 3-0-31-2, నాథన్‌ ఎలిస్‌ 4-0-41-1, శామ్‌ కరణ్‌ 4-0-27-0, రాహుల్‌ చాహర్‌ 4-0-24-0, లివింగ్‌స్టోన్‌ 1-0-9-0.
పంజాబ్‌ కింగ్స్‌ : అథర్వ (ఎల్బీ) సిరాజ్‌ 4, ప్రభుసిమ్రన్‌ (బి) పార్నెల్‌ 46, మాథ్యూ షార్ట్‌ (బి) హసరంగ 8, లివింగ్‌స్టోన్‌ (ఎల్బీ) సిరాజ్‌ 2, హర్‌ప్రీత్‌ భాటియా (రనౌట్‌) సిరాజ్‌ 13, శామ్‌ కరణ్‌ (రనౌట్‌) హసరంగ 10, జితేశ్‌ శర్మ (సి) షాబాజ్‌ (బి) హర్షల్‌ 41, షారుక్‌ ఖాన్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) హసరంగ 7, హర్‌ప్రీత్‌ బరార్‌ (బి) సిరాజ్‌ 13, నాథన్‌ ఎలిస్‌ (బి) సిరాజ్‌ 1, అర్షదీప్‌ సింగ్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 150.
వికెట్ల పతనం : 1-4, 2-20, 3-27, 4-43, 5-76, 6-97, 7-106, 8-147, 9-149, 10-150.
బౌలింగ్‌ : మహ్మద్‌ సిరాజ్‌ 4-0-21-4, వేనీ పార్నెల్‌ 3-0-32-1, వానిందు హసరంగ 4-0-39-2, విజరు కుమార్‌ 3-0-29-0, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 1-0-5-0, హర్షల్‌ పటేల్‌ 3.2-0-22-1.