– బకాయిలను వెంటనే చెల్లించాలి : సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ బండి సంజయ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిరిసిల్ల వస్త్రపరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కోరారు. శుక్రవారం ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ”సిరిసిల్లలో నాలుగు నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మీకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.270 కోట్లను ఇంతవరకు చెల్లించలేదు. కొత్త ఆర్డర్లు ఇవ్వట్లేదు. దీంతో యజమానులు పరిశ్రమను బంద్ పెట్టారు. ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పనిచేస్తున్న దాదాపు 20 వేల మంది పవర్ లూమ్, అనుబంధ రంగాల(వార్పిన్, సైజింగ్, డైయింగ్..)కార్మికులు పస్తులుంటున్నారు. బకాయిలు చెల్లించి కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని ఆసాములు, కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరం. వారి డిమాండ్లు న్యాయమైనవే. వెంటనే మీరు స్పందించి సమ్మె విరమింపజేయడంతోపాటు బకాయిలను వెంటనే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలి” అని కోరారు. పవర్‌లూమ్ కార్ఖానాలకు 24 ఏండ్ల నుంచి 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్‌ను ఇప్పుడు నిలిపివేయడంతో రెట్టింపు బిల్లులు వస్తున్నాయని వాపోయారు. ఆసాములు ఆ బిల్లులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలనీ, సబ్సిడీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలనీ, నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయిందనీ, ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు.