– కార్మిక కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిరదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల మేరకు బకాయిలు చెల్లించలేదని విమర్శించింది. రానున్న రోజులకు అవసరమైన ఆర్డర్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితంగా ఈ ఉత్పత్తులు చేయలేమంటూ యజమానులు చేతులెత్తేశారని పేర్కొన్నారు. 30 వేల కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణం జోక్యం చేసుకుని సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమను, 30 వేల కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ నిర్ణయాలే వస్త్ర పరిశ్రమకు ఉరితాడు
ఒకవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకం, మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలు, చేనేత పరిశ్రమ మీద కన్నెర్ర జేయడం వల్ల వస్త్ర పరిశ్రమకు ఉరితాడుగా మారాయని వీరయ్య విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ బోర్డును, చేనేత బోర్డును రద్దు చేసిందని తెలిపారు. చేనేత ఉత్పత్తుల మీద, వాటి ముడిసరుకుల మీద 12 శాతం జీఎస్టీని పెంచిందని పేర్కొన్నారు. ఫలితంగా వస్త్ర పరిశ్రమలో ఉన్న బడాబాబులను కాపాడుతున్నదని విమర్శించారు. చిన్న చిన్న టెక్స్‌టైల్ పరిశ్రమలను దెబ్బతీస్తున్నదని వివరించారు. ఇవన్నీ ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఉరితాడుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సిరిసిల్ల ఉరిసిల్ల’గా మారకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. గత బకాయిలను చెల్లించి ప్రభుత్వంలో వివిధ శాఖలకు అవసరమైన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను వెంటనే సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తి సంస్థలకు ఇవ్వాలని సూచించారు. తద్వారా ఈ పరిశ్రమను కాపాడాలనీ, 30 వేల కార్మిక కుటుంబాల జీవితాలను ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలనీ, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.