కూపీ లాగుతున్న సిట్‌

– గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం
హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. గ్రూప్‌-1 పరీక్షలో 100 మార్కులకు పైగా మార్కులు ఎవరికెవరికి వచ్చాయి..?ఎవరెవరు ఈ స్కాంలో ఉన్నారు..? ఇంకెంతమంది సూత్రధారులున్నారనే కోణంలో సిట్‌ కూపీ లాగుతోంది. ఇప్పటికే వందకు పైన మార్కులు వచ్చిన వారి జాబితాను సిట్‌ అధికారులు సిద్ధం చేశారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు నుంచి అభ్యర్థుల సమాచారం సేకరించిన అధికారులు.. సిట్‌ కార్యాలయానికి రావాలని వారికి సూచించారు. ఆయా అభ్యర్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. విచారణకు వచ్చిన అభ్యర్థుల నుంచి 15 అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు.
వివరాలన్నీ రికార్డు…
బయోడేటా ఆధారంగా ఎంతవరకు చదివారు? ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? తదితర అంశాలను సిట్‌ అధికారులు రికార్డ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని పోటీ పరీక్షలు రాశారు? ఎన్ని మార్కులు వచ్చాయనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. గతంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసి ఉంటే వాటి సమాచారం కూడా తీసుకుంటున్నారు. సమాచారం అనంతరం తిరిగి సంప్రదిస్తామని అభ్యర్థులకు సిట్‌ అధికారులు సూచిస్తున్నారు.