సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకం

Adilabadనవతెలంగాణ-లక్షెట్టిపేట
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని అంబేద్కర్‌ యువజన సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు కల్లేపల్లి విక్రమ్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఏచూరి చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏచూరి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. భూమి, భుక్తి, పీడిత జన విముక్తి కోసం పోరాడిన మహానీయుడన్నారు. యుపీఏ హయాంలో కామన్‌ మినిమం ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి ఉపయోగ పడుతున్న ఈజీఎస్‌ లాంటి పథకాలను ప్రభుత్వాలకు సూచించారన్నారు. పేదల పక్షాన పార్లమెంట్‌లో శాస్త్రీయ బద్దంగా పోరాడారని అన్నారు. పేదల పక్షాన మాట్లాడే గొంతు మూగబోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శనాల నవీన్‌ కుమార్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌ కుమార్‌, యూత్‌ నాయకులు దర్శనాల రమేష్‌, ఊరేడి రాజ్‌ కుమార్‌, దర్శనాల చంద్రయ్య, మడిపెల్లి వెంకటేష్‌ పాల్గొన్నారు.
జన్నారం : సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిద్దామని ఆ పార్టీ మండల కార్యదర్శి కనికారం అశోక్‌, నాయకుడు గుడ్ల రాజన్న అన్నారు. శుక్రవారం మండలంలోని సుందరయ్య నగర్‌ కాలనీలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. సీతారాం ఏచూరి పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. అతని మృతి పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి ప్రవేశం చేసి పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కూకటికారి బుచ్చయ్య కొండ గొర్ల లింగన్న, అంబటి లక్ష్మణ్‌, మగ్గిడి జయ పాల్గొన్నారు.
జైపూర్‌ : కమ్యూనిస్టు యోధుడు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీరని లోటని దేశం ఒక పోరాట యోధున్ని కోల్పోయిందని ఎమ్మెల్యే వివేక్‌ వెంటస్వామి అన్నారు. విలువలు సిద్దాంతాల కలబోతగా తన రాజకీయ ప్రస్థానం చివరి వరకు కొనసాగించిన సీతారాం ఏచూరి ఆదర్శప్రాయుడని అభిప్రాయపడ్డారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాండూర్‌ : ఐబీ కేంద్రంలో శుక్రవారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరికి ఘన నివాళ్లు అర్పించారు. మండల కార్యదర్శి దాగాం రాజారాం మాట్లాడుతూ సీతారాం ఏచూరి భారత కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో ఒక ధ్రువతార అని కొనియాడారు. దేశంలోని పీడిత ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. దుర్గ నాన్నయ్య, వేల్పుల శంకర్‌, బొల్లం రాజేశం పాల్గొన్నారు.
తాండూర్‌ : ఏచూరి ఆశయ స్ఫూర్తితో పేద ప్రజల అభ్యున్నతి కోసం ఉద్యమించాలని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసుపులేటి వెంకటేష్‌ కోరారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీఐయూ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏచూరి విద్యార్థి దశ నుండే వామపక్ష విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితుడై తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్‌, సతీష్‌, ఆకాష్‌, వేణు, సురేష్‌ పాల్గొన్నారు.