– సీతారామ ప్రాజెక్ట్ పాతడిజైన్ ప్రకారం కొనసాగించాలి
– పూర్తి స్థాయి నిధులు కేటాయించాలి
– పాసుపుస్తకం మీద తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కామేపల్లి
సీతారామ ప్రాజెక్టును సాధించింది సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రతోనే అని, ప్రాజెక్ట్ పాత డిజైన్ ప్రకారం కొనసాగించాలని, పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. పార్టీ కామేపల్లి మండల ప్లీనం మండలకేంద్రంలో వింజంనాగభూషణం అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ ప్లీనానికి ముఖ్యఅతిథిగా నున్నా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గారడి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. రైతులకు బ్యాంకులో తీసుకున్న రుణాలన్నింటినీ ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు పెట్టి రైతులను మోసం చేస్తుందన్నారు. సీతారామ ప్రాజెక్టు కాల్వ ఏన్కూరు వరకు వచ్చిన దానిని స్వలాభం కోసం ముగ్గురు మంత్రులు ఉన్న ప్రాంతానికి మళ్ళించడం జరిగిందన్నారు .తక్షణమే ఆ కాలవను అటు వెళ్లకుండా పాత డిజైన్ ప్రకారం కొనసాగించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టును సాధించింది తమ్మినేని వీరభద్రం పాదయాత్రతోనే అని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించాలని పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాజెక్టును గుర్తించామన్నారు. తాము డిమాండ్ చేయడం వలన నిధులు మంజూరు చేసి నిర్మిస్తున్నారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో వర్తింపచేయాలని, ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సీతారామ ప్రాజెక్టుకు నిధులు తక్షణమే విడుదల చేయాలని, కల్తీ లేని ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం అందించాలని, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, తక్షణమే ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ప్లీనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, మండల కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌రెడ్డి, బాదావత్ శ్రీనివాస్, అరెం లక్ష్మి, ఆడప ఉపేందర్, కిన్నెర రామచంద్రయ్య, గుండా వెంకట్ రెడ్డి, ఎస్కె హుస్సేన్, రాంబాబు, అజ్మీర న న్, రామకృష్ణ, జానయ్య, భాగం రామారావు, రమేష్, గోపయ్య, సకినాలు శ్రీనివాస్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.