– సీఎం చేత పంపులకు స్విచ్ఛాన్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు సర్కారు ముమ్మర ఏర్పాట్లు చేసింది. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్‌ను గురువారం (ఆగస్టు 15) ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు. పంప్‌హౌస్ మోటార్లు స్విచ్చాన్ చేసి డెలివరీ సిస్టర్న్ వద్ద గోదావరి నదికి సీఎం పూజలు చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా సీఎం నేరుగా భద్రాద్రి జిల్లాకు వస్తారు. స్థానిక రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌లను ప్రారంభించిన అనంతరం అక్కడే భోజనాలు చేసుకుని వైరాలో జరుగనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.