ఆరు గ్యారెంటీలు కాదు..

ఆరు గ్యారెంటీలు కాదు..– 6 నెలలకో సీఎం
– కరెంట్‌ కావాలా.. కాంగ్రెస్‌ కావాలా..?
– పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో కుల్కచర్లకే మొదటగా సాగునీరు
– మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ-కుల్కచర్ల
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు ఏమో కానీ ఆరు నెలలకు ఓ సీఎం మాత్రం తప్పకుండా మారతారని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘కరెంట్‌ కావాలో.. కాంగ్రెస్‌ కావాలో..’ ప్రజలు తేల్చుకోవాలన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కుల్కచర్ల మండలకేంద్రంలో నిర్వహించిన రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ‘నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా.. ఎన్నికలు వచ్చాయంటే ఆగం కావొద్దు.. నిదానంగా మంచి చెడు ఆలోచించాలి’ అని ప్రజలను కోరారు. కేసీఆర్‌ ఒక్కడిని ఎదుర్కోవటానికి ఢిల్లీ నుంచి గెస్ట్‌లు దిగుతున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. హనుమంతుని గుడి లేని ఊరూ లేదు.. కేసీఆర్‌ ప్రభుత్వ పథకాలు అందని ఇల్లు లేదని తెలిపారు. గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచామని, తండాలను పంచాయతీలు చేశామని, పోడు భూములకు పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి తండాలో సేవాలాల్‌ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ముందుగా కుల్కచర్ల మండలానికే సాగునీరు వస్తుందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరో 4 కొత్త పథకాలు తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా పథకం అమలు చేస్తామని, గ్రామాల్లో మహిళల సౌకర్యం కోసం మహిళా భవనాలను నిర్మిస్తామని తెలిపారు. గండ్వీడ్‌, మహమ్మదాబాద్‌ మండలాలను తిరిగి వికారాబాద్‌ జిల్లాలో కలుపుతామన్నారు. ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డిని మరో మారు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదించండి, మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్‌, తదితరులు పాల్గొన్నారు.