ఆరు గ్యారంటీలే మాయే ? : కేసీఆర్‌

ఆరు గ్యారంటీలేమాయే? కరువు తెచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి ొ మోడీ పనితనం బాగుంటే.. రూపాయి విలువ ఎందుకు పడిపోయింది ొ గోదావరి నీళ్లు తరలించుకుపోయేందుకు మోడీ కుట్ర ొ తెలంగాణ హక్కులపై పోరాడాలంటే పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీలుండాలి: కేసీఆర్‌ – కరువు తెచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి
– మోడీ పనితనం బాగుంటే.. రూపాయి విలువ ఎందుకు పడిపోయింది
– గోదావరి నీళ్లు తరలించుకుపోయేందుకు మోడీ కుట్ర
– తెలంగాణ హక్కులపై పోరాడాలంటే పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీలుండాలి: కేసీఆర్‌
నవతెలంగాణ – జగిత్యాల టౌన్‌

”ఎప్పుడు గలగల పారే వరద కాలువకు ఏమైందో ఆలోచించాలి.. నీళ్లు లేక పొలాలు ఎందుకు ఎండిపోయినాయో రైతులు గుర్తించాలి.. కరువు తెచ్చిన కాంగ్రెస్‌కు ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలి” అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆది వారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఓటు వేయించుకుని ప్రజలను ఆగం చేశారని విమర్శించారు.ఆరు గ్యారంటీలను ఒక్కటైనా అమలు చేశారా ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఇస్తున్నామని నిర్మల్‌ సభలో రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, రాష్ట్రంలో ఏ మహిళకైన పడ్డాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఊరికి పోయినా అక్కడి దేవుళ్లపై ఒట్టువేసి ఆగస్టు 15 తరువాత రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెబుతూ.. మరోసారి రైతులను మోసే చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. రైతుబంధు నాటువేసి పంట కోసినాక రైతు బంధు వేస్తామని సీఎం అంటున్నారని, తానేమో పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందజేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి వరికోసినాక రైతుబంధు అందజేస్తానని అంటున్నాడని, ఇది తలాతోక లేని మాటని ఆరోపించారు. 5 ఎకరాల భూమి ఉంటేనే రైతుబంధు ఇస్తామని చెబుతున్నారని, మిగతా రైతులు ఎక్కడ పోవాలని ప్రశ్నించారు. వానాకాలం వడ్లు పోయి యాసంగి వడ్లు అమ్ముకునే టైమ్‌ వచ్చిందని, క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇంకెప్పుడు ఇస్తారని నిలదీశారు. తొమ్మిదేండ్లలో నిరంతరాయంగా కరెంట్‌, మంచినీరు సరఫరా చేశామని, కానీ ఈ నాలుగు నెలల్లో కరెంట్‌, నీళ్లు ఎక్కడికి పోయాయని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేంద్రంలోని మోడీ.. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మోడీ బలవంతుడయితే రూపాయి విలువ ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. దేశంలోని దళితులు, మైనార్టీలు, గిరిజనులు, మహిళలకు మోడీ ప్రభుత్వం వల్ల లాభం జరిగిందా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ గోదావరి నీళ్లను తమిళనాడు, కర్నాటకకు తీసుకుపోతానని అనేక సందర్భాల్లో బహిరంగంగానే చెబుతున్నా.. సీఎం మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రపోజల్‌ వచ్చిందని, తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే మాట్లాడుతామని, అప్పటి వరకు ఏం పీక్కుంటావో పీక్కో అని అన్నానని తెలిపారు.