అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు

Six guarantees on coming to power– తొలి క్యాబినెట్‌లోనే చట్టబద్ధత : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో, నాంపల్లి దర్గాలో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, ఆరు గ్యారంటీల కార్డు ఉంచి ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీనియర్‌ నాయకులు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేస్తామని ప్రమాణం చేసినట్టు తెలిపారు. పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ సెప్టెంబర్‌ 17న తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారని రేవంత్‌ గుర్తు చేశారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెల రూ. 2,500, వంట గ్యాస్‌ రూ. 500లకే ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలు సోనియాగాంధీ ఇచ్చారని తెలిపారు. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ. 15వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12వేలు, వరి పంటకు రూ. 500ల బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ 5 లక్షలు, ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు తెలిపారు. యువ వికాసం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ చేయూత పథకం కింద నెలకు రూ 4వేల పెన్షన్‌, రూ. 10 లక్షల రాజీవ్‌ ఆరోగ్య బీమా లాంటి పథకాలను అమలు చేస్తామన్నారు.ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమంలో ఈ ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేసిందన్నారు.
అడ్డుకున్న పోలీసులు
చార్మినార్‌ వద్దనున్న బాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్‌ నాయకలతోపాటు కార్యకర్తలు, నాయకులు గాంధీభవన్‌కు తరలించారు. 144 సెక్షన్‌ ఉన్నందున గాంధీభవన్‌ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయానికి వెళ్లి పూజలు చేయడానికి అవకాశం ఇవ్వరా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఎక్కువ మంది ర్యాలీగా వెళ్లడానికి వీలులేదంటూ పోలీసులు వాదించారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం కొనసాగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం బాగ్యలక్ష్మి దేవాలయానికి కాకుండా బిర్లా టెంపుల్‌, నాంపల్లి దర్గా వద్దకు వెళ్లేందుకు కొద్ది మందికి అవకాశం ఇచ్చారు.