జీవితం అంటే పెళ్లాం పిల్లలు తర్వాత వాళ్లకు పెండ్లి, అటెన్క వాల్ల పిల్లలు. ఇదంత ఒక ప్రయాణమే. పెండ్లి చేసుడు అతి ముఖ్యమైన పని. పిలగానికి, పిల్లను దొరింపు చేసుడు పిల్లకు పిలగాన్ని చూసుడు, కట్నకానుకలు మాట్లాడుడు ఇదొక పెద్ద కత. ‘పెండ్లి అంటే వంద అబద్దాలు ఆడాలె’ అనే సామెత వున్నది. అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు అవతల సంబంధం మంచిగ అన్పిస్తే అమ్మాయి గురించి, ఆ ఇంటి గురించి తెల్సిన చుట్టాలతోని ఉన్నవి లేనివి కల్పించి మంచి ముచ్చట్లు చెప్పుతరు. ఎందుకంటే దొరింపు కావాలె, లగ్గం చెయ్యాలెనని. పిల్లగాని చూసి వచ్చేప్పుడు నచ్చినా అక్కడ అన్నం తినరు. పిల్లను మొదటిసారి చూసినా అంతే. ఎందుకంటే ‘గతికితే అతకదని’ ఒక నానుడి. గతకడం అంటే తినడం అనే అర్థం. ఏదో లాగా పెండ్లి అయితది. పిల్ల ఇంట్లనే ఖర్చులు ఎక్కువ అయితయి. ఆ ఇంటి వాల్లను ఇవ్వాల్సిన పైసలే వెంటనే ఇయ్యమని ఒత్తిడి చెయ్యరు. ఎందుకంటే ‘పెండ్లి అయిన ఇంట్ల ఆరు నెలలు కరువు’ అనే సామెత అందరికీ తెల్సిందే. ఆడపిల్ల ఇల్లోల్ల పట్ల కొంత సానుభూతి వుంటది. పెండ్లి అంటే హడావిడి, సుట్టాలు, కులపోల్లు, శుభలేఖలు పంచుడు, పెద్ద పనుల్లో ఇంటివాల్లంతా వుంటరు. ఏదీ మరిచిపోరు కానీ ఈ సందర్భంలోనే ‘పెండ్లి సందడిలో పుస్తె, మట్టెలు మరిచినట్లు’ అనే సామెత పుట్టింది. ముఖ్యమైనదే మరిచిపోతే ఎట్ల అనే అర్థంలో వాడుతరు. అట్లనే మధ్యమధ్యలో ఏదన్న పని చేస్తుంటే తుమ్మేవాల్లు వుంటరు. వాల్లను చూసి ‘లగ్గంల తుమ్మినట్టు చేయకు’ అంటరు. ఇవన్నీ ఎప్పుడు పుట్టిన పరంపరలో! శాస్త్రీయమైన విషయం వుండదు. కానీ చెలామణిలో వుంటయి.
ఇంత కష్టపడి తల్లిదండ్రులు పెళ్లి చేస్తే పెండ్లి సంబురంలో చగ్గ వున్నవాల్లను చూసి వీనికి ‘పెళ్లాం బెల్లం తల్లి దయ్యం’ లెక్క అయ్యిందిరా అంటరు. ఇసోంటివి మస్తు వుంటయి. ‘పెంట తవ్వుతుంటే పెంకాసులు ఎల్లినట్లు’ కనిపిస్తయి.
– అన్నవరం దేవేందర్, 9440763479