– లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ఘాతుకం
– స్నేహితుడితో పాటు అతడి కుటుంబాన్ని హతమార్చిన వైనం
– నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిన ఘటన
– నిందితుడు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుడు
నవతెలంగాణ-మాక్లూర్
స్నేహితుని ఆస్తికోసం ఆశపడి అతని కుటుంబంలో ఆరుగురిని నిందితుడు పొట్టనపెట్టుకున్నాడు. స్నేహితుడితో పాటు తన కుటుంబాన్ని ఒక్కొక్కరిని ఒక్కోచోట హతమార్చాడు. అలా వారం వ్యవధిలోనే ఆరు హత్యలు చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కాగా నిందితుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుడు కావడం గమనార్హం. సంబంధీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన రాచర్ల పూనప్రసాద్ (35) కుటుంబం ఏడాది క్రితం స్వగ్రామాన్ని వదిలి.. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి వెళ్లి స్ధిరపడ్డారు. ఆయనకు భార్య రమణి (32) గర్భిణి, కొడుకు చైతు (6), కూతురు చైత్రి (6) కవలలు, ముగ్గురు చెల్లెండ్లు స్వప్న (32), శ్రావణి, స్రవంతి (25) ఉన్నారు. అయితే ప్రసాద్‌కు మాక్లూర్‌లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడైన మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన మెడిద ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. ప్రసాద్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో లోన్ ఇప్పిస్తానని ఆ డబ్బుతో అప్పులు తీర్చుకోవచ్చని ప్రసాద్‌ను ప్రశాంత్ నమ్మించాడు. సులువుగా రుణం వస్తుందని చెప్పి.. ప్రశాంత్ పేర ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బ్యాంకుల చుట్టూ తిరిగినా లోన్ రాకపోవడంతో.. ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్.. పతకం ప్రకారం ప్రసాద్‌ను ఈ నెల 9న బయటకు తీసుకెళ్లాడు. నిజామాబాద్-కామారెడ్డి జాతీయ రహదారికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రసాద్‌ను హత్య చేశాడు. మరుసటి రోజే ప్రసాద్ ఇంటికి వెళ్ళి.. తన భర్తను పోలీసులు అరెస్టు చేశారని ప్రసాద్ భార్య రమణిని నమ్మించి బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను సైతం హతమార్చి బాసర నదిలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరి స్వప్నను హత్య చేశాడు. ఇద్దరు పిల్లలు చైతు, చైత్రి కవల పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో హత్యచేశాడు. ప్రసాద్ చిన్న సోదరి స్రవంతిని మాచారెడ్డి సమీపంలో హత్య చేశాడు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కూడా అదృశ్యం కేసు నమోదు కాలేదు. నమ్మిన స్నేహితుడే హంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించటం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. కాగా.. నిందితుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షునిగా ఉన్నాడు. ఈ హత్యల్లోని ఓ శవం ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. కాగా.. ఈ హత్యలపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదు. అంతా గోప్యంగా ఉంచడం గమనార్హం.