గంగానదిలో పడవ మునిగి ఆరుగురు గల్లంతు

పాట్నా: పాట్నాలోని ఉమానాథ్‌ గంగా ఘాట్‌ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానదిలో మునిగిపోయింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు గల్లంతయ్యారు. కాగా ప్రమాదం జరిగిన పడవలో దాదాపు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రయాణిస్తున్నారని బార్హ్‌ సబ్‌-డివిజనల్‌ అధికారి తెలిపారు. వీరిలో 11 మందిని స్థానికులు ప్రాణాలతో రక్షించారని, ఆరుగురి జాడ తెలియలేదని చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ రంగంలోకి దిగి గల్లంతైన వారి జాడ కోసం వెతుకుతోందని తెలిపారు.