– ఊరిస్తున్న భావోద్వేగ సమరాలు
– నేటి నుంచి ఆసియా కప్
వేడెక్కిన వాతావరణం. భావోద్వేగ సమరాలు. మైదానంలో క్రికెటర్ల కవ్వింపు చర్యలు. సరిహద్దులు, సంస్కృతి సహా రక్త చరిత్ర పంచుకున్న నేపథ్యం ఉన్న ఆసియా దేశాలు.. నేటి నుంచి ఆసియా కప్ వేటకు సిద్ధమవుతున్నాయి. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ముంగిట ఆసియా క్రికెట్ పవర్‌హౌస్‌లు సన్నద్ధత సమరంగా ఆసియా కప్‌లో అదరగొట్టేందుకు ఎదురు చూస్తున్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా శ్రీలంక బరిలో నిలువగా.. ఆసియా టైటిల్‌తో వరల్డ్‌కప్ వార్‌లోకి దిగాలనే ఆలోచనతో టీమ్ ఇండియా ఉంది. ఆరు దేశాల అద్వితీయ క్రికెట్ పోరు.. 2023 ఆసియా కప్ నేటి నుంచి ఆరంభం.
ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లో..
2022లో సైతం ఆసియా కప్ జరిగింది. టీ20 ప్రపంచకప్ ముంగిట పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. కోవిడ్ పరిస్థితుల్లో యుఏఈ వేదికగా మ్యాచులు జరిగాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో ఆసియా కప్ ఫార్మాట్ సైతం మారింది. ఆగస్టు 30న ముల్తాన్‌లో తొలి మ్యాచ్ ఆసియా కప్ ఆరంభం కానుంది. ఐసీసీ ప్రపంచకప్ అనంతరం ప్రపంచ క్రికెట్‌లో ఇదే అతిపెద్ద టోర్నమెంట్. ఆసియా అగ్ర దేశాలు ఆడే ఈ టోర్నీ 1984లో మొదలైంది. 2022 ఆసియా కప్ విజేతగా శ్రీలంక నిలిచింది. ఆసియా కప్‌ను భారత్ ఏడు సార్లు, శ్రీలంక ఆరు సార్లు గెల్చుకోగా.. పాకిస్థాన్ రెండు సార్లు సాధించింది. నేటి నుంచి 16వ ఆసియా కప్ ఆరంభం కానుంది.
పోటీలో ఆరు జట్లు
ఆసియా కప్ వేటలో ఆరు జట్లు నిలిచాయి. అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక సహా నేపాల్ కప్ రేసులో నిలిచింది. నేపాల్ అసోసియేట్ సభ్య దేశం. ఆసియాకప్‌లో నేపాల్ తొలిసారి ఆడుతోంది. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ విజేతగా నిలిచిన నేపాల్.. ఫైనల్లో యుఏఈపై గెలుపొంది అర్హత సాధించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో కొనసాగుతున్న నేపాల్‌కు 20 ఏండ్ల కుర్రాడు రోహిత్ పాడెల్ నాయకత్వం వహిస్తున్నాడు.
టోర్నీ సాగుతుందిలా..!
ఆసియా కప్‌లో పోటీపడుతున్న ఆరు జట్లు తొలి దశలో రెండు గ్రూపులుగా విడిపోతాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నిలిచాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మరో జట్టుతో ఓ సారి ముఖాముఖి తలపడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్4 దశలో ప్రతి జట్టు ఇతర మూడు జట్లతో ఓసారి ఆడనుంది. సూపర్4లో టాప్-2 నిలిచిన రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయి. నేడు తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ తలపడనుండగా.. సెప్టెంబర్ 17న కొలంబోలో ఫైనల్ జరుగుతుంది. మ్యాచులు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకు ఆరంభం అవుతాయి.
హైబ్రిడ్ మోడల్ ఆతిథ్యం
ఆసియా కప్ తొలిసారి హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతుంది. ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కే దక్కినా.. భద్రతా కారణాల రీత్యా భారత జట్టు అక్కడికి వేళ్లేందుకు నిరాకరించింది. దీంతో 13 మ్యాచుల టోర్నీలో 4 నాలుగు మ్యాచులే పాకిస్థాన్‌లో జరుగుతుండగా.. 9 మ్యాచులకు శ్రీలంకలోని పల్లెకల్, కొలంబో వేదికగా నిలుస్తున్నాయి. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచులకు ముల్తాన్, లాహోర్‌లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ సొంతగడ్డపై గ్రూప్-ఏ మ్యాచ్, సూపర్ 4 మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ చేశారు. భారత్ మినహా అప్ఘనిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలు పాక్ గడ్డపై ఆడుతున్నాయి.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..!!
ద్వైపాక్షిక క్రికెట్ అత్యంత క్షీణ దశకు చేరటంతో దాయాది జట్లు కేవలం ఏసీసీ, ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. చివరగా వన్డే ఫార్మాట్‌లో 2019 ప్రపంచకప్‌లోనే భారత్, పాక్ ఢకొీట్టాయి. 2019 వరల్డ్‌కప్ గ్రూప్ దశలో పోటీ పడిన అనంతరం.. ఇప్పుడే మళ్లీ వన్డేల్లో ముఖాముఖి సమరానికి సై అంటున్నాయి. భారత్, పాక్ ఫైనల్‌కు చేరుకుంటే.. ఆసియా కప్‌లో గరిష్టంగా మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.
రసవత్తర భావోద్వేగాలు
ఆసియా కప్ అనగానే భారత్, పాకిస్థాన్ పోరే అందరికి గుర్తుకొస్తుంది. ఈ రెండు జట్లు తలపడితే రెండు దేశాల అభిమానులు, మైదానంలో ఆటగాళ్ల భావోద్వేగాలు సహజంగానే తారాస్థాయిలో ఉంటాయి. కానీ ఆసియా కప్ అంటే.. భారత్, పాక్‌కు పోరుకు మించిన భావోద్వేగ సమాహారం!. ఇటీవల కాలంలో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో మైదానం లోపల, వెలుపల అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌లోనూ ‘నాగిని’ డ్యాన్స్ వైరం కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్ సైతం భావోద్వేగాలకు గురిచేసేదే. దీంతో వరల్డ్‌కప్‌కు మించిన నాటకీయత, భావోద్వేగతకు ఆసియా కప్ వేదికైంది.