నేటి బాలలే రేపటి పౌరులు. నేటి నైపుణ్య యువతే రేపటి ప్రపంచ సుస్థిరాభివృద్ధి వెలుగులు. సృజన, విలక్షణ ఆలోచనలతో కూడిన యువశక్తితో డిజిటల్ యుగపు మానవాళి కృత్రిమ మేధ ఇంధనంగా మరో ప్రపంచాన్ని చూడనున్నది. ప్రస్తుతం నెలకొన్న పేదరికం, ఆర్థిక, సామాజిక అసమానతలు, నిరక్షరాస్యత, జనాభా విస్పోటనం, ప్రజారోగ్య సంక్షోభం, ప్రపంచ అశాంతి లాంటి తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచాన్ని నేటి యువతీయువకులు శాస్త్రసాంకేతిక నైపుణ్యాలను రెక్కలుగా చేసుకొని, సన్మార్గంలో వాయువేగంతో దూసుకుపోతూ సమాజానికి నవ్య ఊపిరులు ఊదడానికి సన్నద్దం కావాలని ఐరాస భావిస్తున్నది. యువతలో కర్తవ్యాన్ని జాగృతపరిచి, బాధ్యతలను అవగాహన పరిచి, రేపటి సుఖమయ జీవితాలకు గొడుగులు పట్టి, ప్రపంచ మానవాళికి కొత్త దారులు చూపుతూ సారథ్యం వహించేలా తయారు చేయడానికి ఐరాస సర్వసభ్య సమావేశం నిర్ణయిచింది. 1999లో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏట ఆగస్టు 12 రోజున ”అంతర్జాతీయ యువజన దినోత్సవం (ఇంటర్నేషనల్ యూత్ డే)” ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రపంచం నేడు పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రతికూల వాతావరణాలు, అకారణ ఆధిపత్యం కోసం భీకర యుద్ధాలు, విపత్తులు, కాలుష్య భూతాలు లాంటి భయానక భవిష్యత్తు హెచ్చరికల నడుమ రేపటి ఆరోగ్య ధరణికి గొడుగులు పట్టడం నేడు తక్షణావసరంగా మారిందని యువత గమనించాలి. పర్యావరణహిత సుస్థిరాభివృద్ధి మార్గంలో నడవవలసిన సమయం ఆసన్నమైందని గమనించిన ఐరాస నేడు గ్రీన్ డెవలప్‌మెంట్ మంత్రం జపిస్తున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాత యువజన దినం – 2023 నినాదంగా ”సుస్థిరాభివృద్ధి సాధనలో హరిత నైపుణ్యాల యువత (గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ : టువర్డ్స్ ఏ సస్టేనబుల్ వరల్డ్)” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ శాంతి స్థాపనలో యువశాంతి కిషోరాలుగా మారి ఉగ్రవాదం, తీవ్రవాదం, యుద్ధ వాతావరణాలను అర్థం చేసుకుంటూ భూమాత చుట్టూ శాంతి కపోతాలు స్వేచ్ఛగా ఎగిరేలా వాతావరణం కల్పించేలా యువత కార్యోన్ముఖులు కావాలని ఐరాస భావిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 24ఏండ్ల వయసున్న వ్యక్తులను యువతీ యువకులుగా యునెస్కో నిర్వచించింది. ప్రపంచ జనాభాలో 16-17శాతం, అనగా దాదాపు 1.4 బిలియన్ల యువ జనాభా ఉన్నది. అంతర్జాల విప్లవంతో సమసిపోయిన దేశ, ఖండ, ప్రాంత సరిహద్దులతో యువత ప్రపంచాన్ని చుట్టేస్తూ సుస్థిరాభివృద్ధిలో సింహభాగం తీసుకుంటున్నది. ఆధునిక యువతలో అవసర నైపుణ్యాలను పెంచుతూ, విలువలు కలిగిన అంతర్జాతీయ స్థాయి విద్యను బోధిస్తూ, సమన్వయ భావనను జాగృత పరుస్తూ, మానవాళి సమస్యల పరిష్కారాల దిశగా ఆలోచనలు చేస్తూ, పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో పాలుపంచుకుంటూ, విజేతను ప్రోత్సహిస్తూ, సృజనకు పునాదులు వేస్తూ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తూ, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పరిపూర్ణ పౌరులుగా తయారు చేయడానికి ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలి. హరిత అభివృద్ధికి సంబంధించిన పరిజ్ఞానం, అంతర్జాతీయ స్థాయిలో మానవీయ విలువల వికాసం, బాధ్యతల పట్ల అంకితభావం, సమాజం పట్ల సదాలోచనలు ప్రస్తుత యువతలో జనించేలా విద్యా బోధనలు కొనసాగాలి. ‘స్కిల్స్ ఫర్ ఫ్యూచర్’, ‘స్కిల్స్ ఫర్ గ్రీన్ జాబ్స్’ లాంటి నూతన భావనల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించాలి. వ్యక్తిత్వ వికాసం, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను అందించడం, ఉన్నత విద్యలో నిష్ణాతులుగా మార్చడం నేటి విద్యాసంస్థల కనీస బాధ్యత అని తెలుసుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు తరగని ఇంధనాల వినియోగం, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ, జీరో కార్బన్ ఉద్గార స్థాయికి చేరడానికి ముమ్మర ప్రయత్నాలను చేయడం నేటి యువత కర్తవ్యంగా తీసుకోవాలి. పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడానికి కావాల్సిన విజ్ఞానం, సామర్థ్యం, దృక్పథం, గ్రీన్ విలువలు కలిగిన యువతను సన్నద్దం చేయడం తక్షణమే జరగాలి. కార్చిచ్చులు, కరువులు, వడగాలులు, తీవ్ర అకాల వర్ష వరదలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గడం లాంటి సమస్యలను అధిగమించడానికి ప్రతి 10మంది ప్రపంచ యువతలో ఏడుగురు హరిత అభివృద్ధి దిశగా ప్రయాణించడం జరగాలి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంబంధ అవకాశాలను అర్థం చేసుకుంటూ యువత జాగ్రత్తగా అడుగులు వేయాలి. 2030 నాటికి వాతావరణ మార్పుల కారణంగా 40శాతం ఉద్యోగ ఉపాధులు కోల్పోయే ప్రమాదం ఉందని, గ్రీన్ స్కిల్స్ విభాగంలో 8.4మిలియన్ల ఉద్యోగాలు కల్పించబడతాయని తెలుసుకోవాలి. గ్రీన్‌జాబ్స్ పెరిగితే ఇతర అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగాలు పెరగడం జరుగుతుందని నమ్మాలి. నేడు గ్రీన్ స్కిల్స్ డిమాండ్ కన్న సప్లై తక్కువగా ఉన్నది. దాదాపు 60శాతం యువత గ్రీన్ ఎకానమీకి కావలసిన నైపుణ్యాలకు దూరంగా ఉన్నారు. గతేడాది యువతలో గ్రీన్ టాలెంట్ 12శాతం పెరగడం గమనించారు. దాదాపు 67శాతం యువతలో డిజిటల్ నైపుణ్యాల స్థాయి తక్కువ ఉన్నాయని, 2015-21 మధ్య 66శాతం గ్రీన్ జాబ్స్ పెరిగాయని, 19 మిలియన్ల గ్రీన్ ఉద్యోగుల్లో 6మిలియన్లను మాత్రమే మహిళలు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నేడు గ్రీన్ ఎనర్జీని సమర్థవంతంగా బోధించే విశ్వవిద్యాలయాలు లేకపోవడం విచారకరమని, హరిత విజ్ఞానంతో సాధించే అభివృద్ధి మాత్రమే ఆమోదయోగ్యమైనదిగా గుర్తించబడే రోజులు సమీప భవిష్యత్తులో రానున్నాయని తెలుస్తున్నది.
(12 ఆగస్టు ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం’)
– బీఎంఆర్, 9949700037