– కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు పత్రికలపై అనుచిత వ్యాఖ్యలు
విశాఖ: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకూ ‘జివిఎల్ టీం-ఎస్‌బిఐ’ బ్యానర్‌పై అట్టహాసంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఎస్‌బిఐ నుంచే కాకుండా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచీ వసూలు చేసిన నిధులపై రాజ్యసభ సభ్యులు జివిఎల్.నరసింహారావు సమాధానం చెప్పకుండా దాట వేశారు. సంక్రాంతి సంబరాల అనంతరం మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘కల్చరల్ కార్యక్రమాలు ఘనంగా చేశారు కదా… ఎంత ఖర్చయింది? ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారు? ఈ నిధులు ఎలా వచ్చాయి’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వాటికి సమాధానం చెప్పకుండా సమావేశం అయిందనిపించారు. ఓ కమ్యూనిస్టు పార్టీ తనపై విమర్శలు చేసిందంటూ ఎదురు దాడికి దిగారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోయాయని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటి విమర్శలను, కమ్యూనిస్టు పార్టీ పత్రికలో తనపై వచ్చే వార్తలను పట్టించుకోబోనని అన్నారు.
జివిఎల్‌ది పక్కా రాజకీయ అవినీతి : సీపీఐ(ఎం)
సంక్రాంతి సంబరాల పేరిట లక్షలాది రూపాయలు దంచుకోవడమే కాకుండా కమ్యూనిస్టు పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘జివిఎల్ టీం-ఎస్‌బిఐ కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించడమేంటి? ఇది పక్కాగా రాజకీయ అవినీతి. కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని విశాఖలో జివిఎల్ అధికార దుర్వినియోగం చేయడం దారుణం’ అని పేర్కొన్నారు. సంబరాలకు ఎంతెంత వసూలు చేశారో ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎస్‌ఆర్ నిధులను సామాన్య ప్రజల సంక్షేమం, అత్యవసర సదుపాయాలకు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా బిజెపి వాడుకోవడం భారతీయ సంస్కృతా అంటూ ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జివిఎల్ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.